నా జీవితాన్ని తెలంగాణకు అంకితం చేస్తా

నా జీవితాన్ని తెలంగాణకు అంకితం చేస్తా

సీఎం కేసీఆర్ ను నమ్ముకుంటే మన బతుకులు మారవన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. మహిళలు ఇబ్బందులు పడుతున్నా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేపట్టిన పాదయత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా మహేశ్వరం మండలం లేమూరులో అక్కడి ప్రజలతో మాటా ముచ్చట చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు షర్మిల. కేవలం ఐదేళ్లు మాత్రమే సీఎంగా ఉన్న వైఎస్ఆర్..ఎలాంటి ట్యాక్సులు పెంచకుండానే..ఉచిత పథకాలతో పాటు ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు . ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ కు పట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి సీఎం మనకు అవసరమా అని అన్నారు.


సీఎం కేసీఆర్ తో ఎలాంటి లాభం లేదన్నారు వైఎస్ షర్మిల. ఉద్యమ కారుడు కదా అని పాలనాధికారం ఆయన చేతిలో పెడితే.. కేసీఆర్ కుటుంబం తప్ప..ఏ కుటుంబం బాగుపడలేదన్నారు. నీళ్ళు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే చెందాయని ఆరోపించారు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నింపడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులు వయస్సు పెరిగిపోవడంతో పాటు.. ఉద్యోగాలు రాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆర్  పాలనలో ఎవరూ ఉద్యోగాల కోసం చనిపోలేదన్నారు.

కుటుంబంలో ఒకరికి కాకుండా..అర్హులైన వారందరికీ ఫెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. సొంత ఇంటి కల నెరవేరాలంటే వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. నేను ఇక్కడే పుట్టి..ఇక్కడే పెరిగానని..ఇక్కడి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. తనకు అవకాశం కల్పిస్తే..నా జీవితాన్ని తెలంగాణకు అంకితం  చేయడంతో పాటు ...మీ బతుకులు  మార్చడానికి నా జీవితాన్ని ధారపోస్తా అని భరోసా ఇచ్చారు.

అంతేకాదు.. ప్రజలకు మంచి రోజులు రావాలంటే...కేసీఆర్ లాంటి మోసగాళ్ల నుంచి తెలంగాణను విముక్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల.