ఏపీ మున్సిపోల్స్ లో వైసీపీ క్లీన్ స్వీప్

ఏపీ మున్సిపోల్స్ లో వైసీపీ క్లీన్ స్వీప్


అమరావతి: ఏపీలో కార్పొరేషన్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ హవా కొనసాగింది. 11 కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేసింది.  విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలను గెలుచుకుంది. తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకుంది. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల  మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం అంతగా కనిపించలేదు. ఏపీలోని 13 జిల్లాల్లో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్  ఎన్నికల ఫలితాలను ప్రకటించలేదు.

విజయవాడలో వైసీపీ హవా..

విజయవాడ కార్పొరేషన్ ను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 64 డివిజన్లలో 36 డివిజన్లలో వైసీపీ  క్యాండిడేట్లు గెలిచారు. టీడీపీ 10 స్థానాలతో సరిపెట్టుకుంది. 11వ డివిజన్ నుంచి టీడీపీఅభ్యర్ధి కేశినేని శ్వేత విజయం సాధించారు. విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 98 డివిజన్లలో వైసీపీ58 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 30 స్థానాలు దక్కించుకుంది, జనసేన 3, బీజేపీ 1 స్థానంలో మాత్రమే గెలిచాయి. అనంతపురం కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 స్థానాల్లో వైసీపీ 45 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 8 స్థానాలకే పరిమితమైంది.  తిరుపతి కార్పొరేషన్ లో మొత్తం 49 డివిజన్లలో వైసీపీ 48 డివిజన్లను గెలుచుకుంది. కడప, కర్నూలు కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుంది.

చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం..

మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీ గెలిచింది. పుంగనూరులో టీడీపీ ఖాతా తెరవలేదు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20  స్థానాల్లో వైసీపీ గెలవగా, టీడీపీ నాలుగు వార్డులకే పరిమితమైంది. అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ  ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో సరిపెట్టుకుంది. యనమల సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది.

హిందూపురంలో ఎంఐఎం ఖాతా ఓపెన్

హిందూపురం మున్సిపాలిటీలో ఐఎంఐ బోణీ కొట్టింది. 16వ వార్డులో ఎంఐఎం క్యాండిడేట్ జిగిని 123 ఓట్లతో గెలిచారు. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లలో, కడప జిల్లా పొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని ఆదోని, అనంతపురం జిల్లాలో హిందూపురం ముస్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. హిందూపురం మినహా ఎక్కడా గెలవలేదు.