మీరు చెప్పిన పంట వేయడానికి రైతులేమన్న బానిసలా?

మీరు చెప్పిన పంట వేయడానికి రైతులేమన్న బానిసలా?
  • సీఎం కేసీఆర్ పై  వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ఫైర్  

హైదరాబాద్, వెలుగు: “రైతులు వరి పండించొద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నడు. వరి వేస్తే.. ఉరి వేస్కోవాలా? ఇందుకేనా కేసీఆర్ ను ఎన్నుకున్నది. రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవద్దా? వాళ్లకు ఆ స్వేచ్ఛ కూడా లేదా? ఇదెక్కడి న్యాయం? రైతులేమన్న బానిసలా?” అని సీఎం కేసీఆర్ పై వైస్సార్​ టీపీ చీఫ్  షర్మిల మండిపడ్డారు. వరి సాగు వద్దంటే,  కాళేశ్వరం ఎందుకు కట్టారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు కట్టారా? లేక మీ ఫామ్ హౌస్ కు నీళ్లు ఇచ్చుకునేందుకా? అని నిలదీశారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా బుధవారం (8వ రోజు) మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని తిమ్మపూర్, గాజులపురుగు తండా క్రాస్, బేగంపేట్, మాదాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో 12 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు. ఎలిమినేడులో మహిళలతో బతుకమ్మ ఆడి, మాటముచ్చట నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు పేపర్ లాగా ఉన్నాయని, ఆయన అవి తప్ప ఇంకేమైనా ఇచ్చాడా? అని షర్మిల విమర్శించారు. టీవీ యాంకర్ శ్యామల పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇదేనా అద్భుత పాలన?

“కేసీఆర్ పాలన అద్భుతమని చెబుతున్నరు. నిజంగానే అలా ఉందా? పెన్షన్లు రాని వారు చేతులెత్తండంటే చాలా మంది ఎత్తుతున్నరు. మరి అద్భుతమైన పాలన ఎక్కడుంది? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ చదువులు, ఫీజు రీయింబర్స్ మెంట్, పోడు భూములకు పట్టాలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు,  ఇంటికొక జాబ్ హామీలు ఏమైనయ్” అని షర్మిల ప్రశ్నించారు. రైతులకు రైతు బంధు ఇస్తున్నమంటున్నారని, కానీ ఇచ్చే దానికంటే వారి నుంచి తీసుకునేదే ఎక్కువని అన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సీఎం ఉరేసుకొని చచ్చిపోవాలి” అని మండిపడ్డారు. ‘‘జాబ్స్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. అయినా కేసీఆర్ లో చలనమే లేదు. పైగా హమాలీ పని చేసుకొని బతకండని నిరుద్యోగులకు మంత్రులు సలహాలు ఇస్తున్నరు” అని ఫైర్ అయ్యారు. 

మిషన్ కాకతీయలో అవినీతి: రాఘవరెడ్డి

మిషన్ కాకతీయ పథకంలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జైలుకెళ్లడం ఖాయమని వైఎస్ఆర్ టీపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు ఎన్నో చూశామన్నారు. కానీ ప్రభుత్వమేమో ప్రజలకు ఇబ్బందులే లేవని చెబుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 40 గ్రామాల్లో పాదయాత్ర చేయగా, 50 శాతం గ్రామాల్లో జనం నీటి కోసం అల్లాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న మిషన్ భగీరథ నీళ్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.