ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్రు : వైఎస్ షర్మిల

ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్రు : వైఎస్ షర్మిల

బీజేపీకి ఆర్ఎస్ఎస్లాగా..టీఆర్ఎస్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు తమపై ఎందుకంత కక్షగట్టారని ప్రశ్నించారు. కారణం లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులను కేసీఆర్ వాడుకుంటున్నారని విమర్శించారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి ఆమె ఆమరణ దీక్షను చేపట్టారు. 

సీఎం కేసీఆర్ ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తాలిబన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలను ఎత్తిచూపినందుకే తమను నిర్భంధాలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన ఒక్క ఒక్కహామీని నెరవేర్చలేదని.. కరప్షన్ కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బిడ్డ లిక్కర్, కొడుకు ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో ఉన్నది అవినీతి, స్వార్థపరులన్నారు.

మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని 4లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టే దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరాడని విమర్శించారు. తాము ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదని..టీఆర్ఎస్ నాయకులే వ్యక్తిగత దూషణలకు దిగారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.