బీసీలకు 42 శాతం కోటాతోనే ..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలి

బీసీలకు 42 శాతం కోటాతోనే ..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలి
  •    ఆర్. కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో 14 బీసీ సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జనాభా ప్రాతిపదికన వాటా ఇస్తామని చెబుతూనే ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో చేసిన చట్టానికి అనుగుణంగా 42 శాతం కోటాను అమలు చేయాలని, హైకోర్టులో ఉన్న రిజర్వేషన్ల కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు.

కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని, అప్పటివరకు బీసీల న్యాయమైన వాటా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు ర్యాగ అరుణ్ కుమార్, జి. అనంతయ్య, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.