హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు, లోకల్ బాడీ, యూఆర్ఎస్ స్కూళ్లలో చదివే మూడో తరగతి పిల్లలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ‘ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ’ (ఎఫ్‌ఎల్‌ఎస్) నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే ఈ పరీక్షలో మన తెలంగాణ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మూడో తరగతి పిల్లలందరినీ పరీక్షలకు సిద్ధం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నెలాఖరు నుంచే మాక్ టెస్టులు నిర్వహించేలా ఎస్సీఈఆర్టీ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం పిల్లలకు ఎఫ్ఎల్ఎస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆ విద్యార్థుల్లో లాంగ్వేజ్ (భాష), న్యూమరసీ (గణితం) సామర్థ్యాలను పరీక్షించనున్నారు. ఈ నెల10 నుంచి జనవరి 22 వరకు ఏయే రోజు ఏం ప్రాక్టీస్ చేయించాలనే టైం టేబుల్‌ను కూడా రిలీజ్ చేశారు. .
స్కూళ్లలో ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రిపరేషన్ కోసం 90 నిమిషాల పీరియడ్ కేటాయించాలని, దీంట్లో ఫస్ట్ 45 నిమిషాలు సిలబస్ టీచింగ్ ఉంటే.. రెండో 45 నిమిషాలు ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాక్టీస్ చేయించాలని ఆదేశించారు. దీనికోసం ఎస్సీఈఆర్టీ వెబ్‌సైట్‌లో 10 సెట్ల ‘ఐటమ్ బ్యాంక్’ 3 మాక్ టెస్ట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. స్కూల్ గ్రాంట్స్ ఉపయోగించి హెడ్ మాస్టర్లు వీటిని ప్రింట్ తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

