- హైదరాబాద్‌లో కొత్త భద్రతా వ్యవస్థ
- హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ప్రజా భద్రత, మహిళా రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు పోలీసింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను ‘పోలీస్ మెంటార్’గా నియమించనున్నట్టు ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హచ్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మార్గదర్శక్’ శిక్షణ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేసి, ‘మార్గదర్శక్’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమ రెండో దశ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడారు. మహిళలు తమ సమస్యలను భయం లేకుండా, మరింత స్వేచ్ఛగా వెల్లడించేందుకు “స్పందన - ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్”ను అందుబాటులోకి తెచ్చినట్టు సీపీ తెలిపారు. ఈ వ్యవస్థ మార్గదర్శక్ వాలంటీర్లు, పోలీస్ మెంటార్లతో కలిసి పనిచేస్తూ మహిళలకు బలమైన రక్షణ కవచంగా నిలుస్తుందని చెప్పారు. మహిళలు భయం, అవగాహన లేమి వల్ల వేధింపులు, గృహహింసను బయటకు చెప్పలేకపోతున్నారని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి బాధితులకు భరోసా కల్పించడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశమని.. ప్రజలు సమాజంలో మార్పు తెచ్చే 'చేంజ్ మేకర్స్'గా ఎదగాలని పిలుపునిచ్చారు.
