వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ల్యాండ్ అక్విజిషన్ కింద రూ.100 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం ఖిల్లాగణపురంలో ఆయన మాట్లాడుతూ గణపసముద్రం రిజర్వాయర్ భూనిర్వాసితులైన 481 మంది రైతులకు రూ.45.21 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమ అయిందని, గత ప్రభుత్వం కంటే రెండింతలు అధికంగా పరిహారం అందించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుందని తెలిపారు.
అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి శ్రీనివాసపూర్‌లో రూ.7.50 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించారు. నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను, క్రీడా పోటీల విజేతలకు మెమెంటోలను ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
