బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ పేరిట సాగుతున్న భారీ సైబర్ మోసానికి సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఒక వ్యక్తిని బెటిన్ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులమని నమ్మించి, ఆన్లైన్ గేమ్స్ ద్వారా లాభాలు వస్తాయని ఆశ చూపి రూ. 1.50 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సయీద్ ఉద్దీన్, మహ్మద్ తాజుద్దీన్, మమ్మద్ యూనస్, ఎండీ అయూబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా స్థానికుల పేర్లపై సిమ్ కార్డులు కొనుగోలు చేసి, వాటిని దుబాయ్‌లో ఉన్న ముదస్సిర్ అనే వ్యక్తికి ఒక్కొక్కటి రూ. 1,200 చొప్పున మొత్తం 250 సిమ్ కార్డులు సరఫరా చేశాడు. ముదస్సిర్ ఈ సిమ్ కార్డుల ద్వారా నకిలీ బెట్టింగ్ వెబ్సైట్లు నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన స్కామర్ల కోసం గాలిస్తున్నారు.
