- రూ.895 కోట్లు మంజూరు ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!
- నేడు కరీంనగర్ కు రానున్న కేంద్ర అధికారుల బృందం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మహర్దశ పట్టనుంది. స్మార్ట్ సిటీ పేరుతో ఇప్పటికే కరీంనగర్ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తాజాగా అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద మరో మూడు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.895 కోట్లు. అందులో భాగంగా పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్‌లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు కేటాయించనుంది. కరీంనగర్‌లో ఇంటిగ్రేటెడ్ సమగ్ర ఘన వ్యర్థాల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు రూ.65 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కమిటీ ఆదేశాల మేరకు శనివారం కేంద్ర అధికారుల బృందం కరీంనగర్ కు రానుంది. సిటీలో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశమై ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించనుంది. కాగా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలు మేయర్ పదవిని కాషాయ పార్టీకి అప్పగించడంతో నిధులు తీసుకురావడంపై దృష్టి సారించారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కార్పొరేషన్ కు రూ.10 కోట్లు మంజూరయ్యాయి.
దీంతోపాటు స్మార్ట్ సిటీ లో భాగంగా కార్పొరేషన్ కు రూ.70 కోట్లు వచ్చాయి. ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నూ కలిసిన బండి సంజయ్.. కరీంనగర్ ను యూసీఎఫ్ స్కీంలో చేర్చాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలను పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపారు. వీటికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల అపెక్స్ కమిటీ రెండ్రోజుల క్రితం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
