ఆరు నెలల్లో ప్రభుత్వ ఖజానాకు 90 కోట్లు గండి!

ఆరు నెలల్లో ప్రభుత్వ ఖజానాకు  90 కోట్లు గండి!
  • విజిలెన్స్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ దాడుల్లో అక్రమాల గుట్టురట్టు
  •     అక్రమంగా తరలిస్తున్న 2,669 టన్నుల ఇసుక,
  •     రూ.1.3 కోట్లు విలువైన పీడీఎస్ రైస్ స్వాధీనం
  •     134 వాహనాలు సీజ్‌‌, 27 ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు
  •     ప్రతిభ కనబరిచిన 67 మందిని సత్కరించిన విజిలెన్స్ డీజీ శిఖాగోయల్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ దాడులు కొనసాగుతున్నాయి. గత ఆరునెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడులు, తనిఖీల్లో వివిధ విభాగాల్లో కలిపి సుమారు రూ. 90 కోట్ల మేర ఆదాయ లీకేజీలను విజిలెన్స్‌‌ గుర్తించింది. అక్రమంగా తరలిస్తున్న 2,669 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకోవడంతో పాటు 27 ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసింది. 134 వాహనాలు, రూ. కోటి 3 లక్షల 70వేల విలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. 

ఈ మేరకు విజిలెన్స్ డీజీ శిఖాగోయల్‌‌ గురువారం వివరాలు వెల్లడించారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ శాఖలో ఉత్తమ పనితీరుతో ప్రతిభ కనబర్చిన అధికారులను ప్రోత్సహించేందుకు కొత్తగా క్వార్టర్లీ రివార్డ్స్‌‌ రోల్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని స్థాయిలకు చెందిన 67 మంది సిబ్బందిని సత్కరించారు. ఆర్‌‌సీపురం ప్రాంతీయ కార్యాలయం ఉత్తమ పనితీరుకు గుర్తింపు పొందగా, గ్రామీణ ప్రాంతీయ కార్యాలయం అత్యధిక ఎంక్వైరీల పరిష్కారానికి ప్రశంసలు అందుకుంది. కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయం ఆదాయ గుర్తింపులో విశేష ప్రతిభ కనబర్చినందుకు అధికారులు రివార్డులు పొందారు. 

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే గుర్తించాలి: డీజీ శిఖాగోయల్ 

విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌కు చెందిన  రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతీయ యూనిట్ల సిబ్బందితో డీజీ శిఖాగోయల్‌‌ చర్చించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడం, దర్యాప్తుల్లో సమగ్ర దృష్టికోణాన్ని అవలంబించడంపై సూచనలు ఇచ్చారు.  ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నష్టాలను గుర్తించడం మాత్రమే కాకుండా, సేవల లోపాలను సరిదిద్దడం సైతం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌లో భాగమని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం మళ్లింపు, ఆహార కల్తీ వంటి అంశాలు విజిలెన్స్‌‌ ప్రధాన దృష్టి కేంద్రమని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు పన్ను ఎగవేతను నిరోధించడం, ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడం, రవాణా, వాణిజ్య, పరిశ్రమల చట్టాల అమలును కట్టుదిట్టం చేయడంలో శాఖ కట్టుబడి ఉందని శిఖాగోయల్‌‌  తెలిపారు. ప్రజలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లేదా అక్రమాలను టోల్‌‌ఫ్రీ నంబర్ 14432కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్‌‌ డైరెక్టర్‌‌ ఏఆర్. శ్రీనివాస్, డీఐజీ అభిషేక్ మొహంతి, ఎస్పీ బాలస్వామితో పాటు అన్ని ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.