- ఒక బాక్స్ రేటు రూ. 100 నుంచి 300 లోపే
గద్వాల, వెలుగు: టమాటా రేటు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల వ్యవధిలో రేటు 80 శాతానికి పైగా తగ్గిపోయింది. టమాటా తెంపితే కూలీ కూడా గిట్టుబాటు కావడంలేతు. దీంతో టమాటాను మార్కెట్ కు తీసుకెళ్లలేక కొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. మార్కెట్లోప్రస్తుతం టామాటా క్వాలిటీని బట్టి బాక్సు రూ. 150 నుంచి 300 లోపే అమ్ముడుపోతున్నది. ఖర్చులు పోను రైతుకు బాక్స్ కు రూ. 95 నుంచి 200 మాత్రమే చేతికి వస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.
మార్కెట్లో బాక్స్ టమాటా రూ. 150కు అమ్మితే రైతు చేతికి వచ్చేది రూ. 95 మాత్రమే. ధరూర్ నుంచి గద్వాల కూరగాయల మార్కెట్ కు ఒక బాక్స్ తీసుకురావడానికి ఆటో వాళ్లు రూ. 30 తీసుకుంటున్నారు. ఒక్కో బాక్స్ కు మార్కెట్ కమిషన్ రూ. 15, ఆటో నుంచి దింపడానికి, తిరిగి కమిషన్ ఏజెంట్ బాక్స్ లో వేయడానికి హమాలీ రూ.10 ఖర్చు అవుతుంది. 25 కేజీల బాక్స్ అమ్మితే ఖర్చులు పోనూ రైతుకు రూ. 95 మాత్రమే గిట్టుబాటు అవుతుంది. సాగు ఖర్చులు, తెంపే కూలీలు లెక్క వేస్తే రైతులకు మిగలడం అటుంచి నష్టాలు వస్తున్నాయి.
20 రోజుల కింద టమాటా కు మంచి రేటు పలికింది. ఒక బాక్స్ రూ. 700 నుంచి 1000 వరకు అమ్ముడుపోయింది. లోకల్ గా చాలామంది టమాటాలు సాగు చేయడంతో మార్కెట్లోకి సరుకు పెద్ద ఎత్తున రావడంతో కమిషన్ ఏజంట్లు రేట్లు తగ్గించేశారు. ఖర్చులు తడిసి మోపెడు అవుతుండడంతో కొందరు రైతులు టమాటాను మార్కెట్ కు తీసుకు రాకుండానే పశువులకు మేతగా వేస్తున్నారు. కొందరైతే టమాటాలను తెంపకుండానే వదిలేస్తున్నారు.
