8 మంది బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు ..రూ.1.37 లక్షల జరిమానా

8 మంది బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు ..రూ.1.37 లక్షల జరిమానా
  • మానవ అక్రమ రవాణా కేసులో తీర్పు వెల్లడించిన ఎన్ఐఏ కోర్టు  

హైదరాబాద్‌, వెలుగు:  మానవ అక్రమ రవాణా కేసులో 8 మంది బంగ్లా దేశీయులు సహా మొత్తం 9 మందికి ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు, రూ.1.37 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.  కేసు వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరిట ట్రాప్ చేసింది. అక్రమంగా హైదరాబాద్‌కు తరలించింది. అనంతరం వారిని వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఇందుకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

జల్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు బంగ్లాదేశ్‌ మహిళలను రెస్క్యూ చేశారు. బాలాపూర్‌లోని మహిమూద్‌ కాలనీలో ఓ ఇంటి నుంచి మరో మహిళను కాపాడారు. దేశభద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. 2019 అక్టోబర్‌ 12న ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్‌ కింద దర్యాప్తు చేపట్టింది. వెస్ట్‌ బెంగాల్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

బంగ్లాదేశ్‌ మహిళలను అక్రమంగా దేశం దాటించిన ముఠాలో ప్రధాన నిందితులు రుహుల్‌ అమీన్‌ ధాలీ, మహ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌ సహా 12 మందిని అరెస్ట్‌ చేసింది. 2020 అక్టోబర్‌ 17న ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 9 మంది నిందితులను దోషులుగా తేల్చింది.