రూ. 34 లక్షల ఈ-సిగరెట్లు సీజ్..ముఠాలోని ముగ్గురు అరెస్ట్

రూ. 34 లక్షల ఈ-సిగరెట్లు సీజ్..ముఠాలోని ముగ్గురు అరెస్ట్
  •  ఢిల్లీ నుంచి తెప్పించి.. రాపిడో, పోర్టర్ యాప్స్ ​ద్వారా సప్లై

మెహిదీపట్నం, వెలుగు: సిటీలో మరో ఈ– సిగరెట్ల ముఠా గుట్టురట్టైంది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్​లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద సుమారు రూ. 34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శనివారం వెల్లడించారు. పక్కా సమాచారంతో నాంపల్లిలోని బజార్​ఘాట్ ప్రాంతంలో నిఘా ఉంచి బైక్​పై 180 ఈ–సిగరెట్లు సరఫరా చేస్తున్న మహ్మద్ అహ్మద్ (36) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

అతడి వద్ద నుంచి సరుకు స్వీకరించేందుకు వచ్చిన మహ్మద్ అస్జాద్ రజా (30)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి సమాచారంతో అత్తాపూర్​లోని వినీత్ మంత్రి నివాసంపై దాడి చేసి,  భారీగా నిల్వ ఉంచిన ఈ-–సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వినీత్ మంత్రి, అస్జాద్ రజా కలిసి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వినియోగదారులతో సంప్రదింపులు జరుపుతూ, ఫోన్ పే ద్వారా నగదు స్వీకరించి, రాపిడో, పోర్టర్ వంటి యాప్స్ ద్వారా సరుకును సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఢిల్లీకి చెందిన అంకిత్ అనే వ్యక్తి నుంచి పార్శిల్ ద్వారా ఈ నిషేధిత సరుకును కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఈ–సిగరెట్లతో పాటు ఒక బైక్, 4 మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్​ను స్వాధీనం చేసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన ఇన్ స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై కృష్ణ, సిబ్బందిని డీసీపీ అభినందించారు.