భారతదేశంలో విద్యా వ్యవస్థ సమాజ నిర్మాణానికి మూలాధారం. ప్రస్తుత కాలంలో విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసం కాకుండా, సమాజాన్ని అర్థం చేసుకునే, బాధ్యత గల పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉంది. సివిల్స్ సబ్జెక్ట్స్ అంటే భారత రాజ్యాంగం, పాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, భూగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటివి. ఇవి కేవలం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మాత్రమే పరిమితం కావు. ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ప్రాథమిక జ్ఞానం. ఒక్కప్పుడు సివిల్ సర్వీసెస్ పైన అవగాహన లేకపోవడం, ఢిల్లీ లాంటి మహానగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది.
దీంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సివిల్ సర్వీసెస్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సోషల్ మీడియా (యూట్యూబ్) విస్తరణ వల్ల ఇప్పుడు రాష్ట్రాలు నిర్వహించే గ్రూప్ 1 సర్వీసెస్ తోపాటు, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ వైపు మన విద్యార్థులు దృష్టి మరల్చుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలలో కొన్ని వేలమంది కోచింగ్ తీసుకోవడం గమనార్హం.
- విశ్లేషణాత్మక ఆలోచన పెంపొందించేలా..
గత కొన్ని సంవత్సరాల యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాలు నిర్వహించే గ్రూప్ 1 ఫలితాలను విశ్లేషిస్తే బి.టెక్, ఎంబిబిఎస్. ఎంబిఏ కోర్సులు చదివిన అభ్యర్థులు ఉండటం గమనార్హం. వీరంతా డిగ్రీలు పూర్తైన తరువాత రెండు, మూడు సంవత్సరాలు వారు చదివిన డిగ్రీలకు సంబంధంలేని సివిల్ గ్రూప్స్ లాంటి సబ్జెక్ట్ ల పై పట్టు సాధించేందుకు వినియోగించడం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన సబ్జెక్ట్స్‌ను అన్ని కోర్సుల సిలబస్‌లో చేర్చడం అత్యంత అవసరమైంది.
ఈ సబ్జెక్ట్స్‌ను ఇంజినీరింగ్, మెడిసిన్, కామర్స్ వంటి అన్ని కోర్సులలో చేర్చడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక అవగాహన కూడా పెరుగుతుంది. సివిల్స్ సిలబస్‌లో ఉండే అంశాలు విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందిస్తాయి. ఉదాహరణకు, దేశ ఆర్థిక పరిస్థితులు, పాలనలో మార్పులు, సామాజిక అసమానతలు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల వారు సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పొందుతారు.
- సమాజం పట్ల బాధ్యత, అవగాహన ఉండాలి
ప్రస్తుతం యువతలో సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, సరైన మార్గదర్శకం లేక చాలామంది వెనుకబడుతున్నారు. అన్ని కోర్సులలో సివిల్స్ సబ్జెక్ట్స్ చేర్చితే, విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఈ దిశగా సిద్ధమవుతారు. ఇది గ్రామీణ, పేద వర్గాల విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
వారు మొదటినుంచే ఆ సబ్జెక్టులపై అవసరమైన జ్ఞానాన్ని పొందితే ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా సంవత్సరాలకొద్దీ సమయాన్ని, కోచింగ్ ఇనిస్టిట్యూట్లపై డబ్బును వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అలాగే సివిల్స్ సబ్జెక్టులలో పరిజ్ఞానం కేవలం అత్యున్నతస్థాయి పదవులు పొందడమే కాకుండా విద్యార్థుల్లో జాతీయ భావనను కూడా బలపరుస్తాయి. భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో ఐక్యతను కాపాడడానికి రాజ్యాంగ విలువలు, హక్కులు, కర్తవ్యాలపై అవగాహన చాలా ముఖ్యమైనది. అయితే, ఈ మార్పును అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న సిలబస్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది. అందువల్ల, సబ్జెక్ట్స్‌ను సరళీకరించి, ప్రాక్టికల్ విధానంలో బోధించాలి. ప్రాజెక్ట్స్, డిబేట్స్, కేస్ స్టడీస్ వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా విద్యార్థులను ఆసక్తికరంగా చేయవచ్చు, సివిల్స్ సబ్జెక్ట్స్‌ను అన్ని కోర్సుల సిలబస్‌లో చేర్చడం సమాజం పట్ల బాధ్యత, అవగాహన కలిగిన పౌరులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పరీక్షల కోసం కాకుండా, దేశ అభివృద్ధికి దోహదపడే దిశగా ఒక గొప్ప అడుగు అవుతుంది.
- డా. ఎండి ఖ్వాజా మొయినొద్దీన్
