V6 News

నెలలు నిండకముందే పుట్టిన పసిగుడ్డు.. సీపీఆర్తో ప్రాణం పోసిన 108 సిబ్బంది

నెలలు నిండకముందే పుట్టిన పసిగుడ్డు.. సీపీఆర్తో ప్రాణం పోసిన 108 సిబ్బంది

కూకట్​పల్లి, వెలుగు: నెలలు నిండకముందే పుట్టి, గుండె కొట్టుకోక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ శిశువును 108 సిబ్బంది ప్రాణం పోశారు. కూకట్​పల్లి పరిధిలోని మూసాపేటకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన శైలజ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన శిశువు శ్వాస తీసుకోకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో 108కి కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఈఎస్ఐ అంబులెన్స్ సిబ్బంది సతీశ్, రఘు.. కాల్ సెంటర్ డాక్టర్ కేశవరెడ్డి పర్యవేక్షణలో శిశువుకు నిరంతరాయంగా సీపీఆర్ చేస్తూ ప్రాణం పోశారు.

అదే స్థితిలో తల్లీబిడ్డలను సురక్షితంగా నీలోఫర్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, పసిగుడ్డు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.