133 ఏళ్ల మందుల కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు: ఖర్చులు తగ్గించుకునేందుకే WARN నోటిస్..

133 ఏళ్ల మందుల కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు: ఖర్చులు తగ్గించుకునేందుకే WARN నోటిస్..

ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ఔషధ కంపెనీల్లో ఒకటైన మెర్క్ & కో., ఇప్పుడు కంపెనీని పూర్తిగా మార్చుకునే (పునర్నిర్మాణం) ప్లాన్‌లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయని సూచిస్తూ, ఈ కంపెనీ ఇప్పటికే WARN (వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్) అనే చట్టపరమైన నోటీసును ఇచ్చింది.

ఈ చట్టం ప్రకారం, ఉద్యోగులను తొలగించడానికి లేదా కంపెనీని మూసేయడానికి కనీసం 60 రోజుల ముందు యజమానులు ఉద్యోగులకు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. దీనివల్ల ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది.

మెర్క్ వంటి పెద్ద కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం, కంపెనీ  ప్రముఖ క్యాన్సర్ మెడిసిన్ కీట్రూడా (Keytruda),  ప్రముఖ వ్యాక్సిన్ గార్డాసిల్ (Gardasil) మందుల పేటెంట్లు త్వరలో ముగియబోతుండడమే. ఈ రెండింటి పేటెంట్లు 2028లో ముగుస్తాయి. పేటెంట్లు అయిపోతే ఈ మందుల కంటే చౌకైన 'బయోసిమిలర్' మందులు మార్కెట్‌లోకి వస్తాయి. దీనివల్ల కంపెనీకి ఆర్థికంగా నష్టం వస్తుంది.

ఈ నష్టాన్ని తట్టుకోవడానికి కంపెనీ 2027 నాటికి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల ఖర్చును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అడ్మినిస్ట్రేషన్, సేల్స్, పరిశోధన & అభివృద్ధి విభాగాలలో ఉద్యోగులను తగ్గిస్తోంది. మెర్క్ CEO రాబ్ డేవిస్ గతంలోనే ఈ పునర్నిర్మాణంలో వేల ఉద్యోగాల తొలగింపు ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే 2025లో కొన్ని తొలగింపులు జరిగాయి. ఇప్పుడు న్యూజెర్సీలోని క్యాంపస్‌లో 2026 ఫిబ్రవరిలో మరో వందల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు నోటీసు చేశారు.

అమెరికాలో ఔషధాల ధరలు ఎక్కువగా ఉండడంపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. దింతో ధరల సవరణలపై  మెర్క్, ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, మెర్క్ కొత్త మందులను అభివృద్ధి చేయడం, ఇతర కంపెనీలను కొనడంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

పేటెంట్లు ముగియడానికి ముందే  పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకోవడానికి సిడారా, వెరోనా ఫార్మా వంటి కంపెనీలతో వందల కోట్ల  ఒప్పందాలు చేసుకుంది. ఈ పునర్నిర్మాణం జరుగుతున్నా మెర్క్ మూడవ త్రైమాసికంలో $17.3 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది 'కీట్రూడా' అమ్మకాల పెరుగుదల వల్ల సాధ్యమైంది, కానీ 'గార్డాసిల్' అమ్మకాలు మాత్రం తగ్గాయి.