ల్యాండింగ్ సమయంలో సముద్రంలో కుప్పకూలిన బోయింగ్ విమానం

ల్యాండింగ్ సమయంలో సముద్రంలో కుప్పకూలిన బోయింగ్ విమానం

దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలింది. ఈ ఘటనలో గ్రౌండ్ -సర్వీస్ వాహనాన్ని విమానం ఢీ కొట్టడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం EK9788, దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC) నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ రన్‌వే 07Rను తాకినప్పుడు సోమవారం తెల్లవారుజామున 3.53 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని హాంకాంగ్ స్టాండర్డ్ రిపోర్ట్ వెల్లడించింది. TC-ACF రిజిస్టర్ అయిన బోయింగ్ 747-481 (BDSF) విమానం, ల్యాండింగ్ సమయంలో ఎడమ వైపుకు తిరిగి, రన్‌వే పక్కన ఉన్న సముద్రంలోకి కూలి కొంత భాగం మునిగిపోయింది.

ల్యాండింగ్ సమయంలో ఫ్రైటర్.. గ్రౌండ్ -సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం చక్రం ఒకటి ఊడిపోయి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ సర్వీస్ వాహనంలోని ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోయారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది ఇద్దరినీ వెలికితీశారు. డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండటంతో నార్త్ లాంటౌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. మరొకరు స్పాట్ లోనే చనిపోయాడు. కార్గో ట్రాన్స్ పోర్ట్ షిప్లో ఉన్న నలుగురు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.

సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగాయి. అగ్నిమాపక శాఖ, మెరైన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విమానాశ్రయం నార్త్ రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24 నుంచి వచ్చిన డేటా ప్రకారం, EK9788 ల్యాండింగ్ వే.. ల్యాండింగ్ తర్వాత అకస్మాత్తుగా ఎడమవైపుకు మారిపోయింది. ల్యాండ్ చేయడానికి తదుపరి వరుసలో ఉన్న కాథే పసిఫిక్ విమానాన్ని CX851 నిలిపివేసి సౌత్ రన్‌వే వైపు మళ్లించారు.