- ఉన్నవాటిని పట్టించుకోకుండా బాధ్యతల నుంచి పక్కకు
- ఫేజ్ 1లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ రాష్ట్రాలదేనట
- వాటర్ అకౌంట్, లెక్కలు సైతం రాష్ట్రాలే ఇవ్వాలని స్పష్టం
- రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, అధికారులకు తాజాగా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: కేటాయింపులకు మించి పొరుగు రాష్ట్రం నీటిని తన్నుకుపోతున్నా ఆపదు. టెలిమెట్రీలు పెట్టమంటే ఓ పట్టాన చెవికెక్కించుకోదు. ఇదీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తీరు. రెండు రాష్ట్రాల మధ్య నీటి తరలింపులను నియంత్రించాల్సిన బోర్డు.. తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. తాజాగా ఇదే విషయంపై రెండు రాష్ట్రాలకు బోర్డు రాసిన లేఖ చర్చనీయాంశమవుతున్నది. అసలు బోర్డు ఉండీ దండగేనన్న అభిప్రాయాలు ఇరిగేషన్ శాఖ వర్గాల్లో
వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలను తేల్చేందుకు బోర్డు నేతృత్వంలో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
తొలి దశలో 2016లో 18 చోట్ల ఏర్పాటు చేశారు కూడా. కానీ వాటిలో ఎక్కువ భాగం తెలంగాణ ఏరియాల్లోనే ఉన్నాయి. రెండో దశలో అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ వంటి చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు తెలంగాణ ఇప్పటికే రూ.4.30 కోట్ల ఫండ్స్కూడా ఇచ్చింది. ఏపీ మాత్రం తన వంతు వచ్చే సరికి ససేమిరా అంటున్నది. బోర్డును మన ప్రభుత్వం ప్రశ్నిస్తే.. ఏపీ నిధులు ఇవ్వనిది ఎలా ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తున్నది. పైగా మన నిధులన్నింటినీ సొంతానికి వాడేసుకున్నది. తాజాగా ఇప్పుడు ఫేజ్ 1లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల విషయంలోనూ అదే తీరులో వ్యవహరిస్తున్నది. టెలిమెట్రీల నిర్వహణ తమ బాధ్యత కాదంటూ రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల అధికారులకు బోర్డు లేఖ రాసింది.
అది మీ బాధ్యతే..
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టంలోని నిబంధనల మేరకు కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను నియంత్రించే అధికారం మాత్రమే తమకు ఉందని లేఖలో బోర్డు పేర్కొంది. వాటర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, నీటి లెక్కలు తీయడం రాష్ట్రాల బాధ్యతేనని స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఇచ్చే డేటాతో బోర్డు కేవలం ఒక రెగ్యులేటర్‌గా మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. అదే సమయంలో బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొస్తూ 2021 జులై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉండడం, ఇంకా ఎటూ తేలకపోవడంతో నేరుగా నియంత్రించలేమని పేర్కొంది.
ఏపీకి పరోక్షంగా సహకరించేందుకేననే విమర్శలు
రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో బోర్డుకు ఎన్నోసార్లు తెలంగాణ లేఖలు రాసింది. రెండు రాష్ట్రాలతో ఏర్పాటు చేసిన మీటింగుల్లోనూ చాలా సార్లు తేల్చి చెప్పింది. అయినప్పటికీ కృష్ణా బోర్డుకు చీమకుట్టినట్టయినా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన నిధులను వాడేసుకున్న బోర్డు.. ఏపీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. ఏపీ నీళ్లు తీసుకుపోతున్నా.. తెలంగాణ ఫిర్యాదు చేస్తున్నా.. పట్టింపులేనట్టు వ్యవహరించింది. ఇప్పుడు టెలిమెట్రీల బాధ్యత నుంచి తప్పుకోవడం.. పరోక్షంగా ఏపీకి సహకరించేందుకేనా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులేటర్ అని చెప్పకనే చెప్తున్న బోర్డు.. కనీసం ఆ పనినైనా సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ కోటాకు మించి నీటిని తీసుకెళ్లిందని రెండు నెలల్లో నాలుగు లేఖలు రాసింది తెలంగాణ. అయినప్పటికీ ఆ రాష్ట్రాన్ని అడ్డుకునే చర్యలేవీ తీసుకోలేదు. రాష్ట్రాలకే టెలిమెట్రీల నిర్వహణ బాధ్యతలంటే.. ఏపీ జలదోపిడీకి అడ్డు అన్నదే లేకుండా పోతుందనే చర్చ జరుగుతున్నది. అదే సమయంలో తొలి ఫేజ్‌లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీలన్నీ తెలంగాణ భూభాగంలోనే ఉండడం.. ఏపీ భూభాగంలో లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.
టెలిమెట్రీల మెయింటెనెన్స్ మీరే చూసుకోండి
రెండు రాష్ట్రాలు ఎన్నెన్ని నీళ్లు తీస్కెళ్తున్నాయో తేల్చేందుకు 31 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందేనని, ఫేజ్1లో ఇప్పటికే 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశారని బోర్డు గుర్తు చేసింది. తొలిదశలో ఏర్పాటు చేసిన ఆ టెలిమెట్రీల వినియోగం ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగడం లేదని పేర్కొంది. కొన్ని చోట్ల అవి పనిచేయడం లేదని తెలిపింది. ఏర్పాటు చేసిన టెలిమెట్రీల్లో 12 చోట్ల నుంచి రాష్ట్రాలు మాన్యువల్‌గా డేటా ఇస్తున్నాయని, మిగతా ఆరు టెలిమెట్రీలు రిజర్వాయర్ల వద్ద డేటా సేకరించడానికి పెట్టారని పేర్కొంది. మూడు టెలిమెట్రీలు నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వద్ద పెట్టగా.. మరో మూడింటిని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పాయింట్లలో పెట్టారని తెలిపింది. కాగా, ఆ టెలిమెట్రీల నిర్వహణ, రిపేర్లు, డేటా సేకరణ మొత్తం రాష్ట్రాల బాధ్యతేనని తేల్చి చెప్పింది. వాటిని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం, డేటాను అప్డేట్ చేసుకోవడం, రిపేర్లు చేయడం వంటివన్నీ రాష్ట్రాలే చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తమ బాధ్యత లేదంటూ చేతులెత్తేసింది.
