- మూడేండ్ల పాటు ఇవే ఫీజులు
- వాయిదాల పద్ధతిలో చెల్లింపునకు వెసులుబాటు
- 160 కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ సర్కార్ జీవో
- అత్యధికంగా రూ.1.83 లక్షలు.. కనిష్టంగా రూ. 45 వేల ఫీజు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల గందరగోళానికి తెరపడింది. వచ్చే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కు సంబంధించి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) సిఫార్సులను ఆమోదిస్తూ 160 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ జీవో 6ను విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా రిలీజ్ చేశారు.
19 కాలేజీల్లో రూ.45 వేలే..
రాష్ట్రవ్యాప్తంగా 160 ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాదితో పాటు వచ్చే రెండేండ్ల ఫీజులను(2025–26, 2026–27, 2027–28) ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా అత్యధికంగా సీబీఐటీలో 1.83 లక్షల ఫీజు ఉండగా.. సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ.45 వేల ఫీజు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 126 ప్రైవేట్ కాలేజీల్లో లక్షలోపే ఫీజు ఉండడం విశేషం.
ఫీజు రూ.లక్ష దాటినవి కేవలం 34 మాత్రమే ఉన్నాయి. ఏకంగా 80 కాలేజీల్లో తక్కువ ఫీజు ఉండటం పేరెంట్స్ కు ఊరట కల్గించే అంశం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలతో ఈ ఏడాది భారీగా ఫీజులు పెరగకుండా.. కట్టడి చేసినట్టయ్యింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించగా, 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. మిగతా వాటిల్లో తగ్గాయి.
దొడ్డిదారి వసూళ్లకు బ్రేక్
ఫీజుల ఖరారుతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా, వీలును బట్టి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర విరాళాల పేరుతో అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయ లెక్కల ఆధారంగానే ఫీజులు ఖరారు చేశామని, ఒకవేళ ఆ లెక్కల్లో తప్పులున్నట్లు తేలితే ఫీజులు తగ్గించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫీజుల్లో టాప్ టెన్ కాలేజీలు..
కాలేజీ ఫీజు
సీబీఐటీ రూ. 1,83,000
వాసవి రూ. 1,75,000
ఎంజీఐటీ రూ. 1,67,000
సీవీఆర్ రూ.1,63,000
జి.నారాయణమ్మ రూ. 1,62,000
గోకరాజు గంగరాజు రూ.1,60,500
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి రూ.1,59,600
కిట్స్ రూ.1,46,200
బీవీరాజు ఇనిస్టిట్యూట్ రూ.1,46,600
ఎంవీఎస్ఆర్ రూ. 1,43,800
