ఇరాన్ భీకరప్రతీకార దాడులు .. అమెరికన్ బేస్ లపై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్

ఇరాన్  భీకరప్రతీకార దాడులు .. అమెరికన్ బేస్ లపై  డ్రోన్లు, మిసైళ్లతో అటాక్
  • గల్ఫ్​ దేశాల్లోని అమెరికా బేస్​లపై విరుచుకుపడ్డ ఇరాన్
  • యూఎస్ , బ్రిటన్​కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు 
  • 9 యూఎస్​ బేస్​లపై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్
  • తమ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి జరిగిందన్న అజర్​బైజాన్ 
  • ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో మరో 12 దేశాలకు సెగ 
  • ఇరాన్​లో 1,230కి చేరిన మృతులు  
  • హార్మూజ్​లో యూఎస్, ఇజ్రాయెల్, ఈయూ దేశాల నౌకలకు మాత్రమే నో ఎంట్రీ అన్న ఇరాన్

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్:  శ్రీలంక తీరంలో తమ యుద్ధనౌకను బుధవారం ముంచేసిన అమెరికాపై ఇరాన్ గురువారం భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ బేస్​లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇండియన్ నేవీ గెస్ట్ గా వెళ్లిన తమ యుద్ధనౌకను ఎలాంటి హెచ్చరికలు లేకుండా అమెరికా పేల్చేయడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ జలాల్లో తమ యుద్ధనౌకను పేల్చేసినందుకు అమెరికా 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్​ మిసైళ్ల వర్షం కురిపించింది.  అమెరికా దళాలు ఉన్న ప్రాంతీయ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణులను ప్రయోగించింది. రియాద్ (సౌదీ అరేబియా), కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అమెరికా ఎంబసీల వెలుపల డ్రోన్లు పేలడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, జెరూసలెం నగరాల్లో సైరన్లు మార్మోగాయి. అదే సమయంలో, గత 24 గంటల్లో లెబనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హిజ్బుల్లా స్థావరాలపై 80 సార్లు దాడులు చేశామని, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను కూడా ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు కూడా భారీ స్థాయిలో దాడులు చేశాయి. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా'ను అమెరికా నావికాదళం టార్పెడోలతో ముంచేయడంపై ఇరాన్ భగ్గుమంది. 

ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ.. "అమెరికా చేసిన ఈ ఘాతుకానికి వారు తీవ్రంగా పశ్చాత్తాపపడే రోజు వస్తుంది" అని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ మతగురువు ఆయతుల్లా అబ్దుల్లా జవాదీ అమోలీ ఒక అడుగు ముందుకు వేసి, ఇజ్రాయెల్ బలగాల(జియోనిస్టుల), అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రక్తం చిందేలా చేయాలని తమ బలగాలకు పిలుపునివ్వడం సంచలనం రేకెత్తించింది.

ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు

ఇరాన్ గురువారం పర్షియన్ గల్ఫ్ లో అమెరికా ఆయిల్ ట్యాంకర్ పై మిసైల్ అటాక్ చేసింది. దీంతో షిప్పులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యూఎస్ తోపాటు బ్రిటన్ కు చెందిన మొత్తం మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. "ఒక్క చుక్క చమురు కూడా ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్లనివ్వం" అని ఇరాన్ జనరల్ సర్దార్ జబ్బారీ హెచ్చరించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో పలావు జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ పై కూడా ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో షిప్పులోని సిబ్బందిలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. 

ఇరాన్ లో170కి పైగా నగరాలపై దాడులు 

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌‌‌‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో (కరాజ్ దిశగా) గురువారం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. టెహ్రాన్‌‌‌‌లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తాము భారీ స్థాయిలో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు దేశంలోని 174 నగరాలపై ప్రభావం చూపాయని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు 636 ప్రాంతాలలో కనీసం 1,332 దాడులు జరిగాయని, పలు నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తమకు చెందిన 7 స్థావరాలు, 14 వైద్య కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. జోర్డాన్ సరిహద్దులోని అల్-జౌఫ్ ప్రాంతంలో ఒక డ్రోన్‌‌‌‌ను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర లెబనాన్‌‌‌‌లోని ట్రిపోలీ నగరంలో ఉన్న బెద్దావి పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు మరణించారు. దక్షిణ లెబనాన్ తీరప్రాంత హైవేపై వెళ్తున్న వాహనంపై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు మరణించారు. గత నాలుగు రోజుల్లో లెబనాన్‌‌‌‌లో మరణించిన వారి సంఖ్య 70కి పైగా పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.   

శ్రీలంక వైపు ఇరాన్ రెండో నౌక

ఇరాన్‌‌‌‌కు చెందిన ఒక యుద్ధనౌకపై దాడి జరిగిన మరుసటి రోజే, ఇరాన్ కు చెందిన రెండవ నౌక తమ జలాల్లోకి ప్రవేశించడానికి అనుమతి కోరిందని, దీనిపై తగిన చర్యల గురించి ఆలోచిస్తున్నామని శ్రీలంక గురువారం తెలిపింది. అయితే, సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.    

ఇరాన్ లో 1,230కి పెరిగిన మృతులు 

యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ కు చెందిన మృతుల సంఖ్య గురువారం నాటికి1,230కి పెరిగింది. ఇందులో దక్షిణ ఇరాన్ లోని మినాబ్ నగరంలో ఓ స్కూల్ పై జరిగిన బాంబుదాడిలో 180 మంది బాలికలు, సిబ్బంది చనిపోయారు. అలాగే శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా పేల్చేయడంతో 87 మంది చనిపోగా, 61 మంది గల్లంతయ్యారు. ఇక ఇరాన్ లో ఆరు రోజుల యుద్ధంలో వందలాది మంది గాయపడ్డారు. అలాగే లెబనాన్ లో హిజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 77కు పెరిగింది. 500కుపైగా మంది గాయపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 మంది చనిపోయారని లెబనాన్ వెల్లడించింది.  ఇక ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ లో 11 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. అలాగే కువైట్ లోని అమెరికన్ బేస్ పై ఇరాన్ జరిపిన దాడుల్లో ఆరుగురు యూఎస్ సోల్జర్లు మృతిచెందారు. బహ్రెయిన్ లో ఇరాన్ క్షిపణి శకలాలు పడి ఒకరు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. ఇరాక్ లోనూ ఇద్దరు మృతిచెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. కువైట్ లో ఇరాన్ దాడుల వల్ల నలుగురు పౌరులు చనిపోగా, 35 మంది గాయపడ్డారు. ఒమన్ లో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. అదేవిధంగా యూఏఈలో పాక్, నేపాల్, బంగ్లాదేశ్ కు చెందిన ఒక్కొక్కరు మృతిచెందగా, 78 మంది గాయపడ్డారు. 

ఇరాన్, ఇజ్రాయెల్ రాయబారుల సవాల్  

దక్షిణ కొరియా రాజధాని సీయోల్‌‌‌‌లో ఇరాన్, ఇజ్రాయెల్ రాయబారులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా గనుక భూతల దళాలను రంగంలోకి దించితే "అమెరికాకు వేల సంఖ్యలో శవపేటికలు తిరిగి వెళ్తాయి" అని ఇరాన్ రాయబారి హెచ్చరించారు. ఇరాన్ అణు కేంద్రాలను, క్షిపణి స్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ రాయబారి స్పష్టం చేశారు. 

అజర్ బైజాన్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి!

తమ దేశంలోని నఖ్చివాన్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడిందని అజర్ బైజాన్ విదేశాంగ శాఖ గురువారం ఆరోపించింది. నఖ్చివాన్ విమానాశ్రయం సమీపంలో ఒక డ్రోన్, ఒక పాఠశాల సమీపంలో మరొక డ్రోన్ దాడి జరిగిందని తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడినట్లు వెల్లడించింది. ఇరాన్ తమకు క్షమాపణ చెప్పాలని అజర్ బైజాన్ అధ్యక్షుడు అలీయేవ్ డిమాండ్ చేశారు.  అయితే, ఈ ఘటనలో తమ పాత్రను ఇరాన్ తోసిపుచ్చింది. తాము అజర్ బైజాన్ పై ఎలాంటి దాడికి పాల్పడలేదని స్పష్టం చేసింది.   

48 గంటల్లో 9 బేస్‌‌‌‌లపై 
డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ 

గడిచిన 48 గంటల్లో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి, ఏకకాలంలో 9 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఖతార్‌‌‌‌లోని అల్ ఉదైద్, బహ్రెయిన్‌‌‌‌లోని 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, ఇరాక్, కువైట్‌‌‌‌లోని స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్ దాడులకు గురైనవాటిలో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ (ఖతార్), అల్ దఫ్రా ఎయిర్ బేస్ (యూఏఈ), అలీ అల్-సలేం ఎయిర్ బేస్ (కువైట్), నేవీ 5వ ఫ్లీట్(బహ్రెయిన్) ఉన్నాయి. అలాగే మువఫక్ అల్-సల్తీ ఎయిర్ బేస్ (జోర్డాన్), ఐన్ అల్-అసద్ ఎయిర్ బేస్, ఎర్బిల్ ఎయిర్ బేస్ (ఇరాక్)పై ఇరాన్ మిసైల్ అటాక్స్ చేసింది.

మధ్యవర్తిత్వానికి మేం రెడీ ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా ప్రకటన

బీజింగ్: ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్యపరంగా పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రత్యేక దూతను పంపాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అన్ని దేశాలు శాంతంగా ఉండి పరిస్థితిని మరింత విషమించకుండా చూడాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి గురువారం ‘ఎక్స్’లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై యూఏఈ ఉపప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్​లతో ఫోన్‌‌లో మాట్లాడినట్టు చెప్పారు. యూఏఈ భద్రతను కాపాడడంలో చైనా సపోర్ట్ ఇస్తుందని తెలిపారు. అలాగే గల్ఫ్ దేశాలు ఈ సమస్యను దౌత్య, చర్చల ద్వారా  పరిష్కరించుకోవడాని చైనా మద్దతు ఇస్తుందని అన్నారు. ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడుల తర్వాత కూడా సౌదీ అరేబియా సహనం పాటించడాన్ని ఆయన ప్రశంసించారు. 


యుద్ధాన్ని ఆపాలని 
ఒమన్ పిలుపు 

గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు పంపేందుకు ఒమన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. "ఏ దేశ పాస్‌‌‌‌పోర్ట్ ఉన్నా సరే, అందరికీ భద్రత పొందే హక్కు ఉంది. యుద్ధాన్ని ఇప్పుడే ఆపండి" అని ఒమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్-బుసైదీ పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణీకుల కోసం ఖతార్ ఎయిర్‌‌‌‌వేస్ మస్కట్ నుంచి లండన్, బెర్లిన్, రోమ్ వంటి నగరాలకు పరిమిత సంఖ్యలో 
'రిలీఫ్ ఫ్లైట్స్' నడుపుతోంది. ఖతార్ ఎయిర్ స్పేస్ మాత్రం ఇంకా మూసివేసే ఉంది.