ఇదంతా గత ఏడాది 15 సెప్టెంబర్ 2024న మొదలైంది. అదే రోజు ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను సీబీఐ ఆఫీసర్ అని, ముంబైలోని అంధేరి నుంచి ఆమె పేరు మీద పంపిన ఒక పార్శిల్‌ను పట్టుకున్నామని, అందులో నాలుగు పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ (MDMA), ఇంకా కొన్ని నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు.
దింతో కంగారుపడ్డ మహిళా.. తాను ఎప్పుడు ముంబై వెళ్లలేదని, తనకేమీ తెలియదని చెప్పినా వారు వినలేదు. మీ గుర్తింపు ఎవరో దొంగిలించారు, ఇప్పుడు మీరు సైబర్ క్రైంలో ఉన్నారు, మీపై విచారణ జరుగుతుంది అని బెదిరించాడు. దింతో ఆమె భయంతో ఫోన్ పెట్టేలోపే, మరో వ్యక్తికి ఫోన్లో తాను సీనియర్ సీబీఐ ఆఫీసర్ అని నటిస్తూ ఆమెపై మరింత ఒత్తిడి చేస్తూ విషయం చాలా సీరియస్, మా దగ్గర సాక్ష్యం ఉంది అని నమ్మించాడు.
"ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, పోలీసులకు కూడా. మీ ఇంటిని క్రిమినల్స్ గమనిస్తున్నారు" అంటూ ఆమెను భయపెట్టారు. కొడుకు నిశ్చితార్థం దగ్గర పడుతుండటం, కుటుంబ ప్రమాదంలో పడుతుందని భయపడి, ఆమె వారు చెప్పినట్లే చేసింది.
వారి చెప్పేది చాలా వింతగా ఉన్నా... స్కామర్లు ఆమెను రెండు స్కైప్ ఐడీలు క్రియేట్ చేయమని, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండాలని ఆదేశించారు. దీంతో ఆమె నెలల తరబడి వీడియో కాల్స్‌లోనే గడిపింది. మొదట మోహిత్ హండా అనే వ్యక్తి, తర్వాత రాహుల్ యాదవ్, ఆ తర్వాత ప్రదీప్ సింగ్ అనే వ్యక్తులు సీనియర్ సీబీఐ అధికారులమని చెప్పుకుంటూ, ఆమె తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటూ నిరంతరం ఒత్తిడి చేశారు.
ఆ తర్వాత డబ్బుల వసూలు మొదలైంది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 22 మధ్య ఆమె తన బ్యాంకు వివరాలు ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ష్యూరిటీ మొత్తం పేరుతో రూ. 2 కోట్లు, ఆపై పన్నులు పేరుతో మరిన్ని డబ్బులు పంపింది.
►ALSO READ | పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు
మోసగాళ్లు చెప్పిన మాటలతో.. ఆ డబ్బు అంతా వెరిఫికేషన్ పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తుందని నమ్మి, ఆమె తన ఫిక్స్డ్ డిపాజిట్లను క్యాన్సర్ చేసి, సేవింగ్స్ డబ్బు మొత్తం ఖాళీ చేసింది. దాదాపు 187 సార్లు డబ్బు ట్రాన్సక్షన్స్ చేసి చివరకు రూ. 31.83 కోట్లు పోగొట్టుకుంది.
ఆమెను నమ్మించడానికి కొడుకు నిశ్చితార్థం ముందు నకిలీ క్లియరెన్స్ లెటర్ కూడా పంపారు. ఈ మానసిక ఒత్తిడితో ఆమె బాగా కుంగిపోయి చివరకు డాక్టర్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ తర్వాత మోసగాళ్లు మళ్లీ మళ్లీ ప్రాసెసింగ్ ఛార్జీలు అడగడం మొదలుపెట్టారు, కానీ డబ్బు తిరిగి ఇచ్చే తేదీని మాత్రం మారుస్తూ వచ్చారు. చివరికి మార్చిలో మోసగాళ్లు పూర్తిగా మాయమయ్యారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
జూన్‌లో కొడుకు పెళ్లి తర్వాత ఆ మహిళకు మోసపోయానని అర్థమైంది. అప్పుడే ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ప్రస్తుతం ఈ సైబర్ మోసగాళ్ల కోసం విచారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
