
వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకుని..హైదరాబాద్కు తరలిస్తున్నారు. మరోవైపు పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు. గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయమైనట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరచూ ఫోన్ కాల్స్, మెసేజులు చేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని వైశాలి చెప్పినట్లు సమాచారం. దీంతో వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించగా..వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష్య పెంచుకున్నట్లు రిపోర్టులో ఉంది. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరూ దిగిన ఫొటోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐదు నెలల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకొని తాత్కాలిక షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా నవీన్ అతని ఫ్రెండ్స్ న్యూసెన్స్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు.. ఈ కేసులో ఇప్పటివరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు.