పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కొద్దిరోజుల క్రితం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రతినిధుల బృందం తిరుగు ప్రయాణ మార్గాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ప్రయాణిస్తున్న విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో వారు అప్రమత్తమై ప్రయాణం మధ్యలోనే విమానం మారారు. విమానాన్ని మషద్‌కు మళ్లించి, అక్కడి నుండి రైలు, బస్సు, కార్ల ద్వారా రహస్యంగా టెహ్రాన్ చేరుకున్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ విశ్లేషకుడు మొహమ్మద్ మరాండీ స్పందిస్తూ, అమెరికాను మేము నమ్మడం లేదని స్పష్టం చేశారు. వాషింగ్టన్ మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని, అందుకే దౌత్య చర్చలు జరుపుతూనే సైనిక పరంగా కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఇరాన్ అమెరికా మధ్య మొదటి చర్చలు ఫలించకపోయిన, వచ్చే వారం తిరిగి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు.
ఈ చర్చలు ఎందుకు ముఖ్యం
1979 ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ ఉన్నత స్థాయి అధికారులు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రాంతీయ శాంతికి, యుద్ధ మేఘాలు తొలగిపోవడానికి ఈ చర్చలు అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం నెలకొన్న భద్రతా ఆందోళనలు, పరస్పర అనుమానాల మధ్య ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఇస్లామాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ అధికారి ఒకరు మాట్లాడుతూ చర్చలు ఈ వారం చివరలో లేదా వచ్చే వారం ప్రారంభంలో తిరిగి ప్రారంభం కావచ్చని, అయితే ప్రణాళికలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

