
- ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి
వనపర్తి/నర్వ, వెలుగు : కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ అబ్జర్వర్, పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. మంగళవారం డీసీసీ ఆఫీస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ డీసీసీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్ష స్థానానికి పోటీ పడే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిశీలకుల బృందం ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు సేకరిస్తుందన్నారు. పార్టీలో సీనియారిటీ, అనుబంధ సంఘాలతో సమన్వయం, పార్టీ పట్ల నిబద్ధత, కార్యకర్తలకు అందుబాటులో ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని తెలిపారు.
నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి మాట్లాడుతూ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతోనే డీసీసీ ఎంపికకు పరిశీలికులను కేంద్ర కమిటీ నియమించిందన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ‘సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం’లో ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి పిలుపునిచ్చారు.
అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుని ఎంపికలో తాము కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నర్వ మండల కేంద్రంలో ‘సంఘటన్సృజన్ అభియాన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, డీసీసీ ప్రసిడెంట్ రాజేంద్రప్రసాద్, పరిశీలకులు కోటేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సంధ్యారెడ్డి, కాంగ్రెస్టౌన్ అధ్యక్షుడు చీర్ల చందర్, నాయకులు కిరణ్‌కుమార్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే అధ్యక్షుల ఎంపిక
మక్తల్, వెలుగు : కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మక్తల్, మాగానూర్, కృష్ణా మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని కొత్త డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తామన్నారు.
జిల్లా స్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకొని ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక అందజేస్తామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ యువజన నాయకులు సిద్ధార్థరెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.