రేవల్లి/ఏదుల/గోపాల్ పేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం అండగా నిలిచి జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి భరోసా ఇచ్చారు.
బుధవారం రేవల్లి, ఏదుల గోపాల్‌పేట మండలాల కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వనపర్తి నియోజకవర్గానికి రెండు కొత్త మార్కెట్ యార్డులు, ఏడు సింగిల్ విండో సంఘాలను మంజూరు చేశామని, నూతనంగా ఏర్పాటైన ఏదుల మండలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మండల అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి పేర్లను సేకరించిన నేతలు, త్వరలోనే కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
