ప్రాజెక్టుల పేరుతో తెచ్చిన డబ్బులన్నీ కేసీఆర్ ఇంట్లోకే

ప్రాజెక్టుల పేరుతో తెచ్చిన డబ్బులన్నీ కేసీఆర్ ఇంట్లోకే
  • కాళేశ్వరంలో రూ.70 వేల కోట్లు కాజేసిండు: షర్మిల

పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రాజెక్టుల పేరుతో తెచ్చిన డబ్బులన్నీ సీఎం కేసీఆర్ ఇంట్లోకే వెళ్లాయని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్లు కాజేశారని ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో తంగెళ్లగూడెం, చీదెళ్ల, గాజుల మల్కాపురం, నూర్జహాన్ పేట గ్రామాల్లో ఆమె పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ సర్కార్.. పేదలకు ఇండ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని షర్మిల విమర్శించారు. కేసీఆర్ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసమే వైఎస్సార్ టీపీ ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్టీతో వైఎస్సార్ అభిమానులంతా ఒక వేదిక పైకి వస్తున్నారని చెప్పారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. కాగా, చీదెళ్లలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించారు. నూర్జహాన్ పేటలో ఏర్పాటు చేసిన వైఎస్సాఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.