- పీపీపీ మోడ్‌లో ఏర్పాటు చేస్తం:మంత్రి తుమ్మల
- ఆగ్రో కెమికల్స్ ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: నకిలీ పురుగుమందులను పరీక్షించేందుకు రాష్ట్రంలో మరో రెండు, మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంత్రిని ఆగ్రో కెమికల్స్ అసోషియేషన్, న్యూఢిల్లీ ప్రతినిధులు సెక్రటేరియెట్‌లో కలిశారు.
రాష్ట్రంలో కలుపు, పురుగు, తెగులు మందుల విక్రయాలు, నకిలీ మందుల నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విక్రేతల లైసెన్స్ విధానాన్ని ఆన్ లైన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం 2 చోట్ల ఉన్న ల్యాబ్‌లలో ఏటా 4 వేల టెస్టులు చేస్తున్నామన్నారు. ల్యాబ్ ల సంఖ్యను పెంచి ఎక్కువ నమూనాలను పరీక్షించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడించారు.
రైతులకు నాణ్యమైన పురుగుమందులు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రతి డీలర్ నెలనెలా పురుగు మందుల విక్రయ వివరాలు, కంపెనీల నుంచి డీలర్లకు అందిన స్టాక్ వివరాలు తెలిపేలా వెబ్సైట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పురుగుమందుల విచ్చలవిడి వినియోగాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి పనిచేయాలని ఆగ్రో కెమికల్స్ అసోషియేషన్ ప్రతినిధులను మంత్రి కోరారు. పీపీపీ విధానంలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. నకిలీ పురుగు మందుల విక్రేతలపై పీడీ యాక్ట్ విధించి కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, అగ్రి డైరెక్టర్ గోపి, జనరల్ మేనేజర్ కమలపురం రమేశ్ రెడ్డి, ధనుక అగ్రిటెక్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
గిడ్డంగుల సంస్థకు స్కోచ్ అవార్డు
స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు 2024కు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోదాముల నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు గాను ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 15న ఈ అవార్డును అందించారు.
ఈ సందర్భంగా వేర్ హౌసింగ్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సంస్థ ఎండీ కోవా లక్ష్మిని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. ఈ డిజిటలైజేషన్‌తో గోడౌన్ లలో ఖాళీ సామర్థ్యం గుర్తించడం, గోదాముల కేటాయింపు రిజర్వేషన్లు, గేట్ ఇన్, గేట్ అవుట్ రశీదులు ఇవ్వడం, ఇన్వాయిస్ లను జనరేట్ చేయడం వేగంగా చేసే వీలుంటుందని మంత్రి తెలిపారు. ఫలితంగా సంస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
