చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద.. నిరుద్యోగులతో రాహుల్గాంధీ చిట్చాట్

చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద.. నిరుద్యోగులతో రాహుల్గాంధీ చిట్చాట్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముమ్మరంగా సాగుతోంది.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. శనివారం(నవంబర్25) వివిధ సభల్లో పాల్గొన్నప్పటికీ అలుపు లేకుండా విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం అవుతున్నారు. 

నిరుద్యోగుల అడ్డా..చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్యోగాలకోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యవతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.సిటీసెంట్రల్ లైబ్రరీ పక్కన ఉన్న చిన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ విద్యార్థులతో చిట్ చాట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... నిరుద్యోగులకోసం అమలు చేయబోయే పథకాలు, జాబ్ క్యాలెండర్ గురించి వారికి వివరించారు రాహుల్ గాంధీ.  

ఈరోజు( నవంబర్ 25) హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతను కలిశాను.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించామని.. రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని.. నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసిందని  ’ రాహుల్ గాంధీ అన్నారు. 

కేసీఆర్ పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు.. నోటిఫికేషన్లు లేక కోర్టు కేసులతో, పేపర్ లీకులతో  30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు.. కొట్లాడి తెచ్చుకన్న తెలంగాణలో వారికి ఉద్యోగాలు రాలేదన్నారు రాహుల్. నిరుద్యోగుల కలలు సాకారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ను రూపొందించిందని వారికి చూపించి భరోసా నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.