ఏనుగుతో చీమ కొట్లాడినట్టే!.. కెనడాకు అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి

ఏనుగుతో చీమ కొట్లాడినట్టే!.. కెనడాకు అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి

వాషింగ్టన్: భారత్ పై కెనడా చేస్తున్న ఆరోపణలు తీవ్ర తప్పిదమని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి, అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇనిస్టిట్యూట్ సీనియర్ ఫెలో మైకేల్ రూబిన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో కెనడా పెట్టుకోవడం అంటే ఏనుగుతో చీమ కొట్లాటకు దిగినట్టేనని హెచ్చరించారు. ఇండియాలో టెర్రరిస్ట్ గా ప్రకటించిన నిజ్జర్ కు ఆశ్రయం ఇచ్చిందే గాక, అతడి చావును మానవ హక్కుల సమస్యగా చిత్రీకరించాలని చూడటం ఏమిటని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వాషింగ్టన్ లో ఆయన ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ఈ మేరకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అమెరికాకు కెనడా, భారత్ రెండూ మిత్ర దేశాలేనని.. కానీ ఏదో ఒక దేశాన్ని ఎంచుకునే పరిస్థితే వస్తే భారత్ వైపే మొగ్గుచూపాల్సి ఉంటుందన్నారు. కెనడా ప్రస్తుత ప్రధాని ట్రూడో గద్దె దిగి, కొత్త వ్యక్తి ప్రధానిగా వచ్చాక మళ్లీ సంబంధాలు మెరుగుపర్చుకునే చాన్స్ ఉంటుందన్నారు. చైనాతో విరోధం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో భారత్ సహకారం అమెరికాకు ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. ఒక టెర్రరిస్ట్ హత్య విషయంలో ట్రూడో ఇలా భారత్ పై తీవ్ర ఆరోపణలు చేయడం మాత్రం ఘోరమైన తప్పిదమన్నారు.