రూ.2వేల నోట్లను వదిలించుకునేందుకు భారతీయులు యూజ్ చేస్తోన్న టెక్నిక్స్ ఇవే

రూ.2వేల నోట్లను వదిలించుకునేందుకు భారతీయులు యూజ్ చేస్తోన్న టెక్నిక్స్ ఇవే

రూ.2వేల నోట్ల ఉపసంహరణపై కేంద్రం ఇటీవల అనౌన్స్ చేసిన ప్రకటనతో దేశమంతా అలర్ట్ అయింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఎక్స్ ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినా.. కొంత మంది మాత్రం అయోమయానికి గురవుతున్నారు. అందుకు నోట్లను మార్చుకునేందుకు పలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలోని చాలా మంది ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు రూ.2వేల నోట్లను ఉపయోగిస్తున్నారు. ప్రీమియం బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేందుకు, మామిడి పండ్లు, లగ్జరీ వాచ్‌లు కొనడానికి తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తీసుకుని మార్కెట్‌లకు తరలి వెళ్తున్నారు. మరికొంతమందేమో వీటిని దేవాలయాలకు భారీ మొత్తంలో విరాళంగా ఇస్తున్నారు.

చాలా మంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం రూ.2వేల నోటును ఆసక్తిగా స్వీకరిస్తున్నారు. లాభాలను పొందాలని, వారి అమ్మకాలు పెరుగేందుకు ఇదే చక్కని అవకాశంగా పరిగణిస్తున్నారు. మే 20 నుంచి రూ.2వేల నోటుతో మామిడి పండ్లు కొనడానికి వచ్చే వారి సంఖ్య  పెరుగుతూ వస్తోందని ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్‌లో ఓ మామిడికాయల అమ్మే వ్యాపారి చెప్పాడు. రోజుకు కనీసం అతనికి 8-10 నోట్లు వస్తున్నాయని, వాటిని తాను తీసుకుంటున్నానని కూడా వెల్లడించాడు. ఇది తన వ్యాపారంలో ఒక భాగమని, సెప్టెంబర్ 30 లోపు అన్నీ ఒకేసారి డిపాజిట్ చేస్తానని చెప్పాడు. నోటు చెల్లుబాటు అవుతుంది కాబట్టి భయం లేదని అతను ధీమా వ్యక్తం చేశాడు.

రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి ముంబైలోని రాడో స్టోర్‌లో స్టోర్ లో రూ.2వేల నోట్లతో లావాదేవీలు పెరుగుతున్నట్టు స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ చెప్పారు. ఇది తమ వాచ్ అమ్మకాలను గతంలో 1-2 నుంచి రోజుకు 3-4 పెంచిందని మార్టిస్ చెప్పారు.

ఆలయంలో రూ.8 లక్షల విరాళం

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మా జ్వాలా దేవి ఆలయానికి చెందిన ఆలయ నిర్వాహకులు తమ విరాళాల పెట్టెలో రూ.2వేల నోట్ల విలువ గల 400 నోట్లను కనుగొన్నారు. 8 లక్షల నగదును భక్తుల సౌకర్యాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మే 19న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే అవి చట్టబద్ధమైన టెండర్‌గా ఉంటాయని హామీ ఇచ్చింది. రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చే ప్రతిస్పందనను బట్టి గడువును పొడిగించవచ్చని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.