పంజాగుట్ట, వెలుగు: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే వీరహనుమాన్ విజయ యాత్రను ఈసారి ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ శ్రీకాంత్, మహాంకాళి విభాగ్ కన్వీనర్ విశాల్, భాగ్యలక్ష్మి విభాగ్ కన్వీనర్ అఖిల్ కలిసి యాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 2న ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. అనంతరం యాత్ర సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని, హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
