టీ20లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్

 టీ20లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్
  • వరుసగా రెండో టీ20లోనూ బంగ్లాదేశ్ ఘన విజయం
  • సిరీస్ లో 2 – 0 ఆధిక్యంలో బంగ్లాదేశ్

ఢాకా:క్రికెట్ లో పసికూన బంగ్లాదేశ్ అగ్రశ్రేణి జట్లకు సవాల్ విసిరే స్థాయికి ఎదుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా రెండు విజయాలతో  అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాకు కోలుకోలేనిరీతిలో గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20 మ్యాచ్ లో ఓటమినే జీర్ణించుకోలేకపోతున్న ఆస్ట్రేలియాకు వరుసగా రెండో టీ20 లోనూ చిత్తుగా ఓడించింది. 
దేశ రాజధాని ఢాకా వేదికలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయంతో  సంచలనం సృష్టించింది.

రెండో టీ20లో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో 2 - 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బంగ్లాదేశ్  బౌలర్లను ఎదుర్కోలేక తడబడుతూ ముక్కుతూ మూలుగుతూ ఆడింది. బంగ్లా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లు మిచెల్‌ మార్ష్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిక్స్‌ 30 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్‌ ఇస్లామ్‌ 2, షకీబ్‌, మెహదీ హసన్‌ చెరో వికెట్‌ తీశారు. 
అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహ్మద్‌ నయీమ్‌(9), సౌమ్యా సర్కార్‌లు(0)లు నిరాశ పరచినా బంగ్లాదేశ్ ఆశావహ దృక్పథం వీడలేదు. ఓపెనర్లు విఫలమైనా ఆ తర్వాత బాధ్యతను భుజానికెత్తుకున్న షకీబ్‌ 26, మెహదీ హసన్‌ 23 పరుగులతో బంగ్లాదేశ్ కు పటిష్ట స్థాయికి చేర్చారు. జట్టు స్కోరు 11.2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.  
5 బౌండరీలు ఒక సిక్సర్ తో అతిఫ్ మెరుపులు
గెలుపు సందేహాస్పదంగా కనిపిస్తున్న తరుణంలో అతిఫ్‌ హొస్సేన్‌ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని చితకబాదుతూ విధ్వంసం సృష్టించాడు. వికెట్ కీపర్ నూరుల్ హసన్ చక్కటి సహకారం అందించడంతో అతిఫ్ ఆస్ట్రేలియా బౌలర్లకు పీడకలలు వచ్చేలా చేశాడు. అతిఫ్ ఐదు బౌండరీలు, ఒక సిక్సర్ లు కొట్టి  37 పరుగులతో నాటౌట్‌ గా నిలవగా, వికెట్‌ కీపర్‌ నూరుల్‌ హసన్‌ 22 నాటౌట్‌గా నిలిచి జట్టుకు సునాయాస విజయంలో తమవంతు పాత్ర పోషించారు.