బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో 34 ఏళ్ల నేత్రావతి అనే మహిళ హత్యకు గురైంది. అయితే కూతురి స్నేహితులను ఇంట్లోకి రానివ్వనందుకే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 34 ఏళ్ల నేత్రావతి ఉత్తరహళ్లి నివాసి. ఆమె ఒక లోన్ రికవరీ కంపెనీలో పనిచేస్తుంటుంది.
నేత్రావతికి ఒక కూతురు. నేత్రావతి కూతురి స్నేహితులు అందరు 16 నుంచి 17 ఏళ్ల వయసున్న మైనర్లు, అలాగే చదువు కూడా మానేసారు. నేత్రావతి చెల్లెలు అనిత కె ఈ హత్యలో తన అక్క కూతురు, ఆమె స్నేహితులు ఉన్నారని అనుమానిస్తూ సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే : మొదట అక్టోబర్ 27న నేత్రావతి ఉరి వేసుకుని చనిపోయిందని అనిత పోలీసులకు తెలిపింది. మరణించిన పరిస్థితులపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. అక్టోబర్ 29న నేత్రావతి మరణించినప్పటి నుండి కూతురు కనిపించకుండా పోయిందని అనిత మళ్ళీ ఫిర్యాదు చేసింది.
అక్టోబర్ 30న నేత్రావతి కూతురు ఇంటికి తిరిగి వచ్చింది. అక్టోబర్ 25 రాత్రి 10:30 గంటల సమయంలో తాను, తన తల్లి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఐదుగురు స్నేహితులు ఇంటికి వచ్చారు.
వాళ్ళు ఇంట్లోకి రావొద్దని అడ్డుకుంటూ, పోలీసులకు ఫోన్ చేస్తానని నేత్రావతి బెదిరించింది. దీంతో స్నేహితులు అందరు కలిసి నేత్రావతిని టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి, చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించడానికి ప్రయత్నించారు.
తన స్నేహితులు కత్తితో బెదిరించి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని కూతురు చెప్పింది. దింతో భయపడిపోయిన తాను వేరే స్నేహితురాలి ఇంట్లో ఉన్నానని, తల్లి చనిపోయిందని తెలిసి ఇంటికి వచ్చానని పేర్కొంది.
కూతురి వాంగ్మూలం ఆధారంగా ఆమె, స్నేహితులు కలిసే నేత్రావతిని చంపి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఘటనపై హత్య (BNS సెక్షన్ 103(1) తో కలిపి 3(5)) సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
