
ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. నివాడా గ్రామానికి చెందిన 19 ఏళ్ల జునైద్ తన ఫ్రెండ్స్ తో రూ.500 కోసం పందెం కాసి యమునా నదిలో దూకి కొట్టుకుపోయాడు.
భారీ వర్షాలు, వరదల వల్ల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరిన సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఇదంతా జునైద్ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో జునైద్ నది ప్రవాహానికి ఎదురీదడానికి ప్రయత్నిస్తూ కొన్ని సెకన్లలోనే కనిపించకుండా పోయాడు. స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన బృందాలు కలిసి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జునైద్ ఆచూకీ ఇంకా దొరకలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జునైద్ అతని స్నేహితులతో కలిసి యమునా నది వద్ద ఉన్నప్పుడు ఈ పందెం జరిగింది. పందెం పై ఏమాత్రం ఆలోచించకుండా జునైద్ నదిలోకి దూకాడు.
బాగ్‌పట్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించగా, నిరంతరం వర్షాలు కురుస్తుండటం, హతినికుండ్ బ్యారేజీ నుండి నీటిని విడుదల చేయడం వల్ల నది ప్రవాహం ప్రమాద స్థాయి మించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పారు.
బాధితుడి స్నేహితులపై పోలీసులు కేసు: పందెం వేసినందుకు అలాగే ఈ సంఘటన రికార్డ్ చేసినందుకు అతని స్నేహితులపై కేసు నమోదు చేసారు పోలీసులు. స్థానిక నివాసితులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ యమునా నది పై భద్రతా చర్యలు, నిఘా పెంచాలని అధికారులను కోరారు.