
భద్రాచలం, వెలుగు : శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. వీకెండ్ కావడంతో రామయ్య దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు ముద్దలను మూలవరులకు అద్ది స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. విశేషంగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు.
బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు పడమర, ఉత్తర ద్వారాల గుండా గర్భగుడిలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిత్రకూట మండపంలో నిత్య కల్యాణం చేశారు.
105 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొనడం విశేషం. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత సాయంత్రం దర్బారు సేవ జరిగింది. గోదావరి వరదలు కారణంగా పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ దంపతులు స్వామి దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయం తరుఫున అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.