బీజేపీలో కొత్త కమిటీ చిచ్చు!

బీజేపీలో కొత్త కమిటీ చిచ్చు!
  • సికింద్రాబాద్ ​పార్లమెంట్​ స్థానం నుంచే 11 మంది ఆఫీస్​ బేరర్లు
  • కేంద్రమంత్రి బండి సంజయ్​ సహా ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు పక్కకు
  • పలు పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం కరువు 
  • బీసీలకూ మొండిచెయ్యే
  • రాంచందర్​రావు టీమ్​కూర్పుపై పెదవి విరుస్తున్న సీనియర్లు, ప్రజాప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర శాఖలో కొత్త కమిటీ చిచ్చు పెట్టింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు సోమవారం కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌ని ప్రకటించగానే అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొత్త కమిటీలో తమ వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించలేదని ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్​కే ప్రయార్టీ ఇచ్చారని గుర్రుగా ఉన్నారు. మరోపక్క కమిటీ ఏర్పాటులో తీసుకోవాల్సిన నిబంధనలనూ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమలం పార్టీ రాష్ట్ర సారథిగా రాంచందర్​ రావు బాధ్యతలు తీసుకున్న రెండు నెలలు దాటిన తర్వాత.. స్టేట్ ఆఫీస్ బేరర్ టీమ్​ను ప్రకటించారు. ఇందులో 22 మంది ఆఫీస్ బేరర్లు కాగా,  ఏడుగురు బీజేపీ మోర్చాల అధ్యక్షులు ఉన్నారు. కాగా, ఈ కమిటీ పేర్లు బయటకు రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా సీనియర్లు షాక్​కు గురయ్యారు. 

ఈ కమిటీలో గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్​ పార్లమెంట్​స్థానం నుంచే 11 మంది ఆఫీస్​ బేరర్లను ఎంపిక చేయడంతో నివ్వెరపోయారు. తమకు, తమ జిల్లాలకు ప్రయారిటీ దక్కకపోవడంతో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.  ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే.. ఏకంగా ఇది సికింద్రాబాద్ కమిటీలా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీకి బలంగా ఉండి, ముగ్గురు ఎంపీలున్న ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ తో పాటు వరంగల్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలకు ప్రాతినిధ్యం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

ఎంపీల ప్రపోజల్స్ చెత్తబుట్టలో..

స్టేట్​లో ఎనిమిది మంది ఎంపీలు, మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఎన్నికల సయమంలో కష్టపడిన కొంతమంది సీనియర్ నేతల పేర్లను కమిటీలో పెట్టాలని ప్రతిపాదించారు. కానీ, చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పట్టించుకోకపోవడంతో గుర్రుగా ఉన్నారు. కమిటీ మొత్తం మాజీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్​చార్జి సునీల్ భన్సల్ సన్నిహితులతో నిండిపోయినట్టు నేతలు ఆరోపిస్తున్నారు. 

వీరితో పాటు రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేసిన నేతతో పాటు గతంలో పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూసిన ఓ ప్రొఫెసర్ కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ ను మాటమాత్రమైనా అడగకుండానే కమిటీని వేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నుంచి ఒక్కరంటే ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, ఈటల రాజేందర్, గోడం నగేశ్ సైతం కమిటీ ఎంపికపై తమ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తమ అనుచరులకు పదవులు దక్కకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నట్టుపార్టీలో చర్చ జరుగుతోంది.

బీసీలకు ప్రయారిటీ ఎక్కడ?

 నిబంధనల ప్రకారం కమిటీలో 40శాతం  పాత వారికి చోటివ్వాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ముగ్గురు కొత్తగా వచ్చిన వారేనని నేతలు చెప్తున్నారు. బండి వర్గీయులుగా ముద్రపడ్డ గీతామూర్తి, గంగిడి మనోహర్ రెడ్డి, రామకిష్టారెడ్డి, ఆంజనేయులు, రాణిరుద్రమకు కమిటీలో చోటు దక్కలేదు. మరోపక్క అర్వింద్, ఈటల ప్రతిపాదించిన పేర్లనూ పక్కన పెట్టారు.  11 ఓసీలుంటే.. దీంట్లో నలుగురు బ్రాహ్మణులకు, నలుగురు రెడ్డీలకు అవకాశం ఇచ్చారు. బీసీ వాదులమంటూ చెప్పుకుంటూనే కనీసం సగం మందికి కూడా కమిటీలో ప్రయార్టీ ఇవ్వలేదని పలువురు  నేతలు వాపోతున్నారు. దీంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే  చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది.