
- డిసెంబర్ నుంచి వాయిదాలు వేస్తున్న హైకమాండ్
- సంక్రాంతిలోపే అంటూ గతంలో లీకులు
- ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మళ్లీ పార్టీలో చర్చ
హైదరాబాద్, వెలుగు: భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రెండు, మూడు నెలల నుంచి త్వరలో, త్వరలో అంటూనే పార్టీ హైకమాండ్ కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటూ కొంతకాలం, ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ మరికొంత కాలం వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తికావడంతో మళ్లీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. గతేడాది చివర్లో బీజేపీ దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
రాష్ట్రంలో ఇప్పటికే బూత్, మండల, జిల్లా కమిటీల ప్రక్రియను పూర్తిచేసిన హైకమాండ్.. అధ్యక్షుడి ప్రకటనపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. రాష్ట్రంలో ఆ పదవికి పోటీ ఎక్కువగా ఉండడంతోనే చాలా ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తున్నది. డిసెంబర్ నెలాఖరులోనే కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సంక్రాంతికి, ఢిల్లీ ఎన్నికల తర్వాత అంటూ కమలం నేతలు చెప్తూ వచ్చారు. చివరికి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగానే ప్రకటన వస్తుందని ప్రచారం చేశారు.
అయితే, ఆ ఎన్నికలు కూడా అయిపోవడంతో.. ఇప్పుడైనా కొత్త అధ్యక్షుడి ప్రకటన చేస్తారా? లేదా? అనే అయోమయం క్యాడర్లో నెలకొంది. ఏండ్లుగా బీజేపీలో పనిచేస్తున్న వారు.. కొత్తగా చేరిన వారు అని పార్టీలో రెండు గ్రూపులు ఏర్పాడ్డాయనే చర్చ ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుపడుతుండగా.. కొత్తగా పార్టీలో చేరిన వారికి చాన్స్ ఇవ్వాలని, తద్వారా మరిన్ని చేరికలకు అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే కొత్త వారికి ఇస్తే ఏండ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రయార్టీ తగ్గుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.
అయోమయంలో కార్యకర్తలు
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావుతో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తున్నది. మహిళా కోటలో ఎంపీ డీకే అరుణ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో హైకమాండ్ ఎవరి పేరును ప్రకటిస్తుందనే ఉత్కంఠ నేతలు, కార్యకర్తల్లో మొదలైంది. అయితే, ప్రస్తుతం బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం, ప్రస్తుతం శాసనసభా పక్ష నేత రెడ్డి కులానికి చెందిన వ్యక్తి ఉండడంతో.. బీసీనే నియమిస్తారని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు.
మరోపక్క రాష్ట్ర ముఖ్యనేతల అభిప్రాయాలను జాతీయ నాయకత్వం సేకరించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుడి నియామకం చేయనున్నట్టు నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఓ మాజీ మంత్రి పేరు ఫైనల్ అయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఢిల్లీకి రాష్ట్ర ముఖ్య నేతలు ఎప్పుడుపోయినా.. హైకమాండ్ పిలిచిందనే ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుండడంతో, సాధ్యమైనంత త్వరగా ప్రెసిడెంట్ పేరు ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.