సాగర్ ఫ్లైఓవర్పై బీఎండబ్ల్యూ బీభత్సం

 సాగర్ ఫ్లైఓవర్పై బీఎండబ్ల్యూ బీభత్సం
  • డీసీఎంను ఢీకొట్టి తగలబడ్డ కారు
  • ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్​లోని సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్​పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పర్​గూడకు చెందిన సాయి కీర్తన్ రెడ్డి (31) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి బీఎండబ్ల్యూ కారులో సిటీ శివారులో జరిగిన ఓ పార్టీకి వెళ్లాడు. అనంతరం సోమవారం తెల్లవారుజామున ఎల్బీనగర్​వైపు తిరిగి వస్తుండగా, సాగర్​ఫ్లైఓవర్​పై బొగ్గు లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. అనంతరం ఫ్లైఓవర్ రైలింగ్​ను ఢీకొట్టి కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారులోని ఇద్దరు స్నేహితులు ప్రాణాలతో బయటపడగా, డ్రైవింగ్ సీటులో ఉన్న సాయి కీర్తన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

అటు డీసీఎం డ్రైవర్ రమేశ్ బాబు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన సాయి కీర్తన్ రెడ్డిని తొలుత కామినేని ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్‌‌పై ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.