
మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ పంపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. రాజయ్య రాజీనామా లేఖపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. అప్పటి నుంచి రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. తర్వాత రాజయ్యకు రైతుబంధు ఛైర్మన్ పదవి ఇచ్చినా ఆయన సంతృప్తిగా లేరు. రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు.అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి రిప్లై లేదు.
పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని తనకు గుర్తింపు లేదని రాజయ్య అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నాయకులు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పోరాటం చేయలేమా అని ప్రశ్నించారు తన మద్దతు దారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
రాజయ్య ఇటీవల వరంగల్ ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రాజయ్య చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ రాజయ్యకు కేటాయించే అవకాశముందని సమాచారం. ఆ హామీతోనే ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.