ఎంపీ అభ్యర్థులు ఎట్ల?..బలమైన క్యాండిడేట్లు దొరక్క తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ 

ఎంపీ అభ్యర్థులు ఎట్ల?..బలమైన క్యాండిడేట్లు దొరక్క తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ 
  •     పోటీకి సీనియర్లు, సిట్టింగుల విముఖత
  •     బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు
  •     కొత్తవాళ్లను బరిలోకి దించాలని అధిష్టానం యోచన 

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల బరిలో దించేందుకు బలమైన అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ తలపట్టుకుంటున్నది. ఈసారి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం కోరినప్పటికీ, వాళ్లెవరూ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. మరికొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. లోక్​సభ బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తున్న నేతల్లో కొందరు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్​ కన్నా బీజేపీ నుంచి పోటీ చేయడమే బెటర్​అనే భావన వారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో కొందరు సిట్టింగ్​ఎంపీలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్​కు ప్రస్తుతం 9 మంది ఎంపీలు ఉండగా, వారిలో కొందరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. బలమైన అభ్యర్థులు దొరక్క చివరికి కొత్త వాళ్లను బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 

ముగ్గురు అభ్యర్థులు ఖరారు! 

చేవెళ్ల, ఖమ్మం, కరీంనగర్ ​లోక్​సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ఇప్పటికే ఖరారు చేసింది. చేవెళ్ల, ఖమ్మంలో సిట్టింగ్​ఎమ్మెల్యేలు రంజిత్​రెడ్డి, నామా నాగేశ్వర్​రావు, కరీంనగర్​లో మాజీ ఎంపీ వినోద్​ కుమార్​పోటీ చేస్తారని లోక్ సభ సన్నాహక సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్​ సెగ్మెంట్​లో ఎంఐఎంతో ఫ్రెండ్లీ కంటెస్ట్ ​ఉంటుందని క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్..  మిగతా 13 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న కేసీఆర్.. ఆ జిల్లాల్లో కొందరు సీనియర్​ లీడర్లను పోటీకి దించాలని భావించినప్పటికీ, తాము పోటీ చేయలేమని సదరు నాయకులు తేల్చి చెప్పినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతున్నది. 

ఇదీ పరిస్థతి.. 

నిజామాబాద్ ​లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీనియర్​ నేతకు సంకేతాలు ఇవ్వగా.. ఆయన వెనుకా ముందు చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ కవిత ఆసక్తి చూపిస్తున్నా, ఆమెను ఎమ్మెల్సీగానే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్​సభ స్థానాల్లోనూ సీనియర్​ నేతలు పోటీకి ససేమిరా అనడంతో ఇతర నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. పెద్దపల్లి సీటును సిట్టింగ్​ ఎంపీ వెంకటేశ్ ​నేతకే ఇస్తామని అధిష్టానం​ రెండ్రోజుల కింద క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

ఆయనకు టికెట్​దక్కకుండా మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో సిట్టింగ్​ ఎంపీ బీజేపీతో టచ్​లోకి వెళ్లారని, దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మెదక్​ లోక్​సభ స్థానం నుంచి కేసీఆర్ ​కుటుంబంలో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తున్నది. మెదక్ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉండగా, వెంకట్రామిరెడ్డి వైపే కేసీఆర్​ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

జిల్లా నేతలు మాత్రం మదన్​ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. మల్కాజిగిరి నుంచి ఒకరిద్దరు లీడర్లను పోటీకి దించాలని అనుకున్నా, వాళ్లు ఆసక్తి​ చూపకపోవడంతో ఎమ్మెల్సీ శంభీపూర్​రాజును బరిలోకి దించనున్నట్టు సమాచారం. నల్గొండ సీటు గుత్తా అమిత్​కు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఇక వరంగల్, నాగర్​కర్నూల్, మహబూబాబాద్, మహబూబ్​నగర్, భువనగిరి సీట్లలో కొత్త అభ్యర్థులను పోటీకి దించవచ్చని అంటున్నారు. ఈ సీట్లను కొందరు లీడర్లకు ఆఫర్​చేసినా, వారు పోటీపై స్పష్టత ఇవ్వకపోవడంతోనే కొత్త వారి కోసం అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

బీజేపీ నుంచి పోటీకి ఆసక్తి.. 

లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య రామాలయ ఎఫెక్ట్​తో పాటు మోదీ చరిష్మా ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్​నేతలు భావిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అమిత్ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. అమిత్​షా టూర్​లోనే కొందరు లీడర్లు బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతున్నది. లేదంటే మూడు, నాలుగు రోజులకు చేరికలు ఉంటాయని సమాచారం.