గాంధీ దవాఖాన వద్ద హైడ్రామా

గాంధీ దవాఖాన వద్ద హైడ్రామా
  • మాతా, శిశు మరణాలు తేల్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు
  • గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు
  • ఎమ్మెల్యే గోపినాథ్, సంజయ్​ స్టేషన్​కు తరలింపు
  • తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్
  • ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ లీడర్లు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో మతా, శిశు మరణాలతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ నేతల నిజనిర్ధారణ కమిటీ చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ఉదయం హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

గాంధీ హాస్పిటల్​కు వెళ్లకుండా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు హాస్పిటల్​కు చేరుకుని ప్రభుత్వం, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, చిలకలగూడ పోలీస్​స్టేషన్​లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.

దీనికి ముందు గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద ఎమ్మెల్యేలు సంజయ్, గోపినాథ్ మీడియాతో మాట్లాడారు. ‘‘మేము దేశద్రోహులమా? మమ్మల్ని ఎందుకు హాస్పిటల్​లోకి వెళ్లనివ్వడం లేదు? దవాఖానాలో మతా, శిశు మరణాలు ఎందుకు పెరిగాయో తెలుసుకునేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏంటి? సూపరింటెండెంట్​తో కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఉందా? లేదంటే నిరంకుశ సర్కార్ ఉందా? అనే డౌట్ వస్తున్నది. ప్రతిపక్ష బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కుతున్నది’’అని అన్నారు. కాగా, గాంధీలో మతా, శిశు మరణాలపై సోషల్ మీడియాలో కొన్ని లెక్కలు వైరల్ అయ్యాయి. కేటీఆర్, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా మధ్య డైలాగ్ వార్ కూడా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు రాజయ్య, సంజయ్, ఆనంద్​తో కేటీఆర్ నిజనిర్ధారణ కమిటీ వేశారు. పరిస్థితులను సమీక్షించేందుకు గాంధీ హాస్పిటల్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.