డబ్బుల కోసం బిల్డర్ కు వేధింపులు..  బీజేపీ కార్పొరేటర్ పై కేసు

డబ్బుల కోసం బిల్డర్ కు  వేధింపులు..  బీజేపీ కార్పొరేటర్ పై కేసు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్  మున్సిపల్​ కార్పొరేషన్​ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై మంగళవారం కేసు నమోదైంది. నగరంలోని అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో బిల్డర్​ గడ్డం ప్రసాద్​ నగర పాలక సంస్థ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అతడికి ఫోన్​ చేసిన కార్పొరేటర్​ పవన్​తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఆఫీసర్లను పంపి పనులు ఆపేయిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బిల్డర్  5వ టౌన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కార్పొరేటర్​ పవన్​ డ్రైవర్​గా పరిచయం చేసుకొన్న వినోద్..​ మరో బిల్డర్​అరుణ్​కు ఫోన్​చేసి డబ్బు డిమాండ్​చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ ప్రకాశ్​తెలిపారు. తన డివిజన్​పరిధిలో కొత్తగా ఇండ్లు నిర్మిస్తున్న వారి నుంచి కార్పొరేటర్​పవన్​రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు డిమాండ్​ చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రైవర్​ వినోద్​పైనా కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉండగా తన డివిజన్​లో వాటర్​ ప్లాంట్​ స్థలాన్ని కబ్జా చేయడానికి బిల్డర్​అసోసియేషన్​  ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మఠం పవన్​ నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్​కు ఫిర్యాదు చేశారు.