రోడ్డుపై ఓపెన్‌గా ఐస్ గొలాలో ఫ్రీగా మద్యం పోసి ఇస్తూ.. చండీగఢ్‌లో వైన్ షాప్ ఓనర్ అరెస్ట్

 రోడ్డుపై ఓపెన్‌గా ఐస్ గొలాలో ఫ్రీగా మద్యం పోసి ఇస్తూ..  చండీగఢ్‌లో వైన్ షాప్ ఓనర్ అరెస్ట్

తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో చండీగఢ్‌లో ఒక వింత  ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఐస్ గొలా పై మద్యం పోసి ప్రజలకు బహిరంగంగా పంచడం అక్కడ పెద్ద వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ మద్యం వ్యాపారిని అరెస్ట్ చేశారు...

ఎం జరిగిందంటే 
చండీగఢ్‌లోని సెక్టార్ 9 మార్కెట్‌లో ఉన్న ఒక వైన్ షాప్ బయట ఈ ఘటన జరిగింది. వైన్ షాప్  ముందు కొంతమంది వ్యక్తులు స్టాల్ లాగా ఏర్పాటు చేసి, ఐస్ ముక్కలపై రంగుల సిరప్‌కు బదులు మద్యాన్ని పోస్తూ అందరికీ పంచుతూ కనిపించారు.

ఉచితంగా ఆహారాన్ని పంచే లంగర్ లాగా.. ఇక్కడ మద్యాన్ని పంచడంతో సోషల్ మీడియా జనాలు దీనికి లిక్కర్ లంగర్ అని పేరు పెట్టారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో ఇలా ఓపెన్‌గా మద్యం పంచడంపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వోడ్కాతో ఐస్ గొలా
ఈ వీడియోలు వైరల్ కావడంతో చండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఐస్ గొలాలో వేర్వేరు ఫ్లేవర్లు ఉన్న వోడ్కా కలిపి ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించి, అనుమతి లేకుండా బహిరంగంగా మద్యం ప్రచారం చేసినందుకు ఆ  మద్యం దుకాణ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 ఈ ఘటనపై చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ స్పందిస్తూ... వైన్ షాప్ బయట బహిరంగంగా మద్యం పంపిణీ చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్  నమోదు చేశాం. అలాగే ఆ మద్యం దుకాణ లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో చర్చ
ఈ వింత ప్రచార స్టయిల్ పై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. కొంతమంది దీనిపై మీమ్స్, జోకులు వేస్తుండగా... మరికొందరు మాత్రం పబ్లిసిటీ కోసం, లైకుల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు.