- ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, లా వంటి అంశాల్లో మాస్టర్ డిగ్రీలు
- 1981 నుంచి చదువును ఆపని చెన్నై ప్రొఫెసర్
న్యూఢిల్లీ: ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే విద్యార్థులు రిలీఫ్ అయిపోతారు. ఎడ్యుకేషన్ అంతా పూర్తయిపోయిందని అనుకుంటారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిపోదామనుకుంటారు. ఓ రెండు, మూడు డిగ్రీలకు మించి పూర్తి చేయరు. అయితే, చెన్నైకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్ 150కిపైగా డిగ్రీలకు సంపాదించారు. తొలిసారి డిగ్రీ చేసినప్పుడు ఆయన అరకొర మార్కులు తెచ్చుకుని జస్ట్ పాస్ మాత్రమే అయ్యారు. అది చూసి ఆయన తల్లి చాలా బాధపడింది. ఆ క్షణంలో ఆగ్రహానికి గురైన ఆమె పాసవ్వడం కాదు.. మంచి మార్కులు తెచ్చుకోవాలని కాస్త గట్టిగా చెప్పింది.
దీంతో ఆయన టాప్ ర్యాంక్ వచ్చేలా మార్కులు తెచ్చుకుంటానని తల్లికి వాగ్దానం చేశారు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆసక్తిని.. ఇప్పటికి కంటిన్యూ చేస్తునే ఉన్నారు. ఆయన 1981 నుంచి ఇప్పటి వరకు చదువుని ఆపలేదు. ఒక పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న కోరిక కాస్త.. తరగని జ్ఞాన దాహంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన ఏకంగా 150కిపైగా డిగ్రీలు, డిప్లోమాలు పూర్తి చేశారు. ఆయన ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా వంటి అంశాల్లో చాలా మాస్టర్ డిగ్రీలు పొందారు.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన ఏకంగా12 ఎంఫిల్ డిగ్రీలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన నాలుగో పీహెచ్ డీని పూర్తి చేస్తున్నారు. మరి ఇన్ని డిగ్రీలు పూర్తి చేయడం కోసం ఆయన తన జీతంలో దాదాపు 90% విద్యకే ఖర్చు చేశారు. ఆయన 1982లో తన బోధనా వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం చెన్నైలోని ఆర్కేఎం వివేకానంద కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు ఆయన చదువుతూనే ఉంటారు. దశాబ్దాలుగా ఇదే అలవాటును కొనసాగిస్తున్నారు.
