బియ్యం ఎక్స్పోర్ట్కు ప్రత్యేక విభాగం : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

 బియ్యం ఎక్స్పోర్ట్కు ప్రత్యేక విభాగం : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
  • అగ్రి వర్సిటీ రోడ్ మ్యాప్ రెడీ చేయాలి: సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండిన బియ్యాన్ని ఎక్స్​పోర్ట్ చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ధాన్యం ఉత్పత్తి పెరుగుతుండటంతో.. వాటిని నిల్వ చేయడం కంటే.. ఎగుమతి చేయడమే కరెక్ట్ అని వివరించారు. అగ్రికల్చర్ వర్సిటీలోని అగ్రి హబ్‌‌‌‌లో సివిల్ సప్లయ్స్ శాఖ మంగళవారం నిర్వహించిన మేధో మథన సదస్సులో బియ్యం ఎగుమతుల అంశంపై విస్తృత చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. బియ్యం ఎక్స్​పోర్ట్ చేసేందుకు వర్సిటీ అధికారులు రోడ్​మ్యాప్ సిద్ధం చేయాలని కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సివిల్ సప్లయ్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మోడల్‌‌‌‌ రూపొందిస్తామన్నారు. యాసంగిలో వరి సాగు తగ్గించి, పప్పు దినుసులు, నూనె గింజల సాగు పెంచేలా చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. డిమాండ్ ఉన్న వరి రకాల సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతులు జరుగుతుండగా, అందులో ఇండియా వాటా 40 శాతంగా ఉందని బియ్యం ఎగుమతుల ఎక్స్​పర్ట్ డాక్టర్ సమరేండు మహంతి తెలిపారు.

 బియ్యం దిగుమతుల్లో ఫిలిప్పీన్స్ 10 శాతంతో టాప్​లో ఉందన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు వరి ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది దాదాపు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి కావొచ్చని వివరించారు. ఇప్పటికే ‘తెలంగాణ రైస్’ బ్రాండ్‌‌‌‌తో ఫిలిప్పీన్స్‌‌‌‌కు ఎగుమతులు ప్రారంభమైనప్పటికీ వాటిని మరింత పెంచాలన్నారు. 50 ఏండ్ల కింద సివిల్​ సప్లయ్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆహార ఉత్పత్తులు డిమాండ్‌‌‌‌కు తగ్గట్లు ఉండేవని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.