కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..రేసులో సీతక్క, భట్టి..!

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..రేసులో సీతక్క, భట్టి..!
  • సీతక్కే సీఎం అన్న రేవంత్
  • దళితులకు ఇవ్వాలని గతంలో ఎంపీ కోమటిరెడ్డి కామెంట్ 
  • రేసులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!
  • బీజేపీదీ బడుగుల నినాదమే
  • సీఎం అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్
  • బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్లాన్

తెలంగాణ రాజకీయాలు ఆదివాసీలు, దళితులు, బీసీల చుట్టే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎంగా చేస్తుందని చెప్పారు. తానా మహాసభలకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామనటం సంచలనంగా మారింది. మరో వైపు బీజేపీ కూడా బడుగు వర్గాలకు చెందిన నేతలకే సీఎంగా అవకాశం ఇవ్వనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. ఆ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంత వరకు చెప్పలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ చర్చకు వస్తున్నాయి. తెలంగాణ వచ్చాక మొదటి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. తొలి, మలి ముఖ్యమంత్రిగా తానే ఉన్న కేసీఆర్ దళితులకు ఆ అవకాశమే ఇవ్వలేదు. మూడెకరాల భూమి, దళితబంధు, సబ్సడీపై వాహనాలు ఇవన్నీ ఆయా సందర్భాల్లో దళితుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రకటించిన వరాలే.. ఈ సారి కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని, సీఎం గా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కారు పార్టీ జోరుగా ప్రచారం చేసుకుంటుంది. ఇదే సమయంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని తెరపైకి తెచ్చి, బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. 

సీతక్కే సీఎం..!

తానా మహాసభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సందర్భం వస్తే సీతక్కను సీఎం చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో 18% ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. మరి 12% ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను ఉప ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తారా’అన్న ఓ ఎన్నరై ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ‘మీరు కాంగ్రెస్ పార్టీ బిగ్ పిక్చర్ చూడలేదు..53 ఏండ్లుగా ప్రజాజీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిని చేసింది. ’నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే మూడింటిలో బడుగు వర్గాలకు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు’అని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందు ప్రకటించబోరని చెప్పారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఓ పాలసీతో ముందుకు పోతోందని అన్నారు. 

భట్టికీ అవకాశాలు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతున్న భట్టి విక్రమార్కను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ సాగుతోంది. అదే జరిగితే సీనియర్ నేత, ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న భట్టి విక్రమార్కకు అవకాశం వస్తుందనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలోనే తానా సభల్లో ఎన్నారైలు భట్టి విక్రమార్కకు సీఎం పదవి అప్పగిస్తే సీతక్కను డిప్యూటీ సీఎంగా చేస్తారా..? అని ప్రశ్నించారనే వాదన ఉంది. 

బీజేపీదీ బడుగుల మంత్రమే

ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసి యావత్ దేశాన్ని ఆకట్టుకున్న బీజేపీ తెలంగాణలోనూ బడుగులకే సీఎం కుర్చీ అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ఇదే సరైన నినాదమని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించినా.. ఎవరికి కట్టబెడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండిపోయింది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం, డాక్టర్ కే లక్ష్మణ్​ ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించడంతోపాటు రాజ్యసభ సభ్యుడిగా నియమించడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. 

టార్గెట్ కేసీఆర్

దళితుడిని సీఎం చేస్తానని గతంలో హామీ ఇచ్చి నిలబెట్టుకోని కేసీఆర్ ను చౌరస్తాలో నిలబెట్టేందుకే కాంగ్రెస్, బీజేపీ ఈ నయా ప్లాన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. మూడో సారి కూడా కుర్చీ కోసం ఆరాట పడుతున్నారనే నినాదాన్ని ప్రజలకు వివరించేందుకు రెండు పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి.