పోలీస్ ఉద్యోగాల భర్తీపై కుట్ర: సీఎం రేవంత్

పోలీస్ ఉద్యోగాల భర్తీపై  కుట్ర: సీఎం రేవంత్

 

  •     అలాంటి శక్తులకు అవకాశం ఇవ్వొద్దు.. ఎలాంటి లోపాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలి
  •     ప్రశ్నపత్రాల ప్రింటింగ్ నుంచి రవాణా వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి
  •     డీజీపీ, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల  విడుదల చేసిన 7,437 పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలతోపాటు ఇతర శక్తులు యత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో.. ఆయన తక్షణమే స్పందించారు. ఇంటెలిజెన్స్​ సమాచారంతో ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో​ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్, రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు, చిన్నపాటి అలసత్వానికి కూడా ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నియమ, నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

భద్రతను కఠినతరం చేయాలి..

పరీక్షల నిర్వహణలో ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, జిల్లాలకు రవాణా చేయడం, భద్రపరచడం వరకు ప్రతి దశలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ముద్రణ నుంచి పంపిణీ వరకు ప్రతి చోటా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని రేవంత్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, అలాగే అభ్యర్థులను భ్రమలకు గురిచేసే అవకాశాలు ఉన్నందున కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌‌‌‌లకు ఎలాంటి అవకాశం లేకుండా కంట్రోల్ రూమ్‌‌‌‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. 

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగ యువతను మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌‌‌‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఖాతాలను తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

పరీక్షలు  పూర్తయ్యేంత వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తతతో నిరంతరం గస్తీ కాయాలని  ఆదేశించారు. ఈ  సమావేశంలో  సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, టీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీఆర్‌‌‌‌బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్​ పాల్గొన్నారు.