పర్యాటక కేంద్రంగా ఖాజాగూడ రాక్స్.. అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు సీఎంసీ కమిషనర్ ఆదేశం

పర్యాటక కేంద్రంగా ఖాజాగూడ రాక్స్.. అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు సీఎంసీ కమిషనర్ ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖాజాగూడ హెరిటేజ్ రాక్ ప్రాంత అభివృద్ధిపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ప్రత్యేక దృష్టి సారించారు. శేరిలింగంపల్లి జోన్ కమిషనర్, యూబీడీ అడిషనల్ కమిషనర్, నార్సింగి, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్లతో కలిసి శనివారం ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సేవ్ ది రాక్స్ సంస్థ సభ్యులు సంగీత, రుత్విక్ కమిషనర్​తో కలిసి రాక్ వాక్ నిర్వహించారు. అక్కడి రాళ్ల చారిత్రక ప్రాధాన్యతను, ప్రత్యేక నిర్మాణాలను సభ్యులు వివరించారు. 

దీంతో రాళ్ల పరిరక్షణతో పాటు ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. హెచ్‌‌ఎండీఏ, హైడ్రా, సీఎంసీ సమన్వయంతో ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో కూడిన రాక్ గార్డెన్​గా మార్చాలని సూచించారు. ఖాజాగూడ సరస్సుతో అనుసంధానం చేస్తూ రాళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, భౌగోళిక వివరాలను పరిశీలించి అవసరమైన అనుమతుల కోసం రెవెన్యూ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి పర్యాటక వసతులతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.