
Current Infraprojects IPO: ఆగస్టు నెలలో ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. కానీ సెప్టెంబర్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఆ షాక్ నుంచి తేరుకుని ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా రెండు రోజుల పాటు కొనసాగనున్న జీఎస్టీ సమావేశంలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయి. ఏఏ వస్తువులపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు, కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కరెంట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు ఇష్యూ కంటే 90 శాతం ప్రీమియం రేటు రూ.152 వద్ద గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేశాయి. అయితే లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో స్టాక్ 4 శాతం తగ్గి రేటు రూ.145 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈలో భారీ లాభంతో లిస్ట్ కావటంతో ఇన్వెస్టర్లు లాభాల పండుగ జరుపుకుంటున్నారు.
కంపెనీ తన ఐపీవో ద్వారా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.41కోట్ల 80 లక్షలు విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో ఆగస్టు 26 నుంచి ఆగస్టు 29 వరకు అందుబాటులో ఉంచబడింది. ఐపీవో కోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధరను రూ.80గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది.
ఐపీవో మూడు రోజుల ఆఫర్ సమయంలో 380 సార్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ చూసింది. ప్రధానంగా నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఐపీవో ఎక్కువ క్రేజ్ చూసింది.
కంపెనీ బిజినెస్ డీటైల్స్..
2013లో స్థాపించబడిన కరెంట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వాటర్ ఇంజనీరింగ్ సేవలను అందించే మౌలిక సదుపాయాలు పునరుత్పాదక ఇంధన సంస్థ. కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్అండ్ కన్స్ట్రక్షన్ సేవల్లో ప్రత్యేకతను కలిగి ఉంది. సోలార్, పవర్, వాటర్ అండ్ సివిల్ EPC కాంట్రాక్టుల్లో పరిష్కారాలను అందిస్తుంది, వీటిలో ఇంటీరియర్ వర్క్స్, రోడ్ ఫర్నిచర్ ఉన్నాయి. అలాగే కంపెనీ హాస్పిటాలిటీ రంగంలో కూడా సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కలిగి ఉంది.